బీహార్ ఎన్నికలు.. క్లీన్ ఇమేజ్ కే పీకే పెద్దపీట
posted on Oct 11, 2025 10:26AM

51 మంది అభ్యర్థులతో తొలి జాబితా
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. ఆ జాబితా మహామహా రాజకీయ ఉద్దండులను సైతం విస్మయానికి గురి చేసిందని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్న అభ్యర్థులను పరిశీలించినట్లైతే.. వారు అత్యధికులు రచయతలు, మేథమెటీషియన్లు, మాజీ బ్యూరో క్రాట్లు, రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాపై ఇప్పుడు బీహార్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రశాంత్ కిశోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 51 మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారూ, క్లిన్ ఇమేజ్ ఉన్నవారే కావడం విశేషం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రశాంత్ కిషోర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కులం, ధనం అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉండే బీహార్ లో ఆ రెంటినీ పూర్తిగా విస్మరించి క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే తన పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలపాలని ప్రశాంత్ కిషోర్ భావించడం ఆసక్తి కలిగిస్తున్నది.
అయితే అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ సామాజిక సమతుల్యతకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 51 మందితో విడుదల చేసిన జాబితాలో 16 శాతం మంది ముస్లిం మైనారిటీలు, 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఇటు సామాజిక సమతుల్యత, అటు విద్యావంతులు, క్లీన్ ఇమేజ్ ఉన్నవారితో ప్రశాంత్ కిషోర్ విడుదల చేసిన జాబితా విడుదల చేయడం ద్వారా తాను బీహార్ లో ధన స్వామ్యం, నేరస్వామ్యం లేని రాజకీయాలు నడుపుతానని ప్రశాంత్ కిశోర్ చెప్పకనే చెప్పారు.