అభివృద్ధి నమూనాగా పిఠాపురం.. 15 వందల కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.!
Published on: Tue Sep 22, 2026 4:27PM

పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో పదిహేను వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ధ్యేయంగా ఈ ప్రణాళికలను రూపొందించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
పట్టణ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించిన ఆయన 200 కోట్ల రూపాయల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మెరుగైన తాగునీటి సరఫరా పథకాలు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. అలాగే ఆధునిక హంగులతో కూడిన బస్టాండ్ నిర్మాణం, ఫిష్ మార్కెట్ అభివృద్ధి, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు.

ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారంగా రక్షణ గోడ నిర్మాణ పనులను చేపట్టామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని వివరించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మత్స్యకారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఉప్పాడ, కొత్తపల్లి మండలాలకు చెందిన 1,258 మంది మత్స్యకారులకు ప్రత్యేక లైఫ్ జాకెట్లు, సీ సేఫ్టీ కిట్లను అందించారు. అంతేకాకుండా డ్రై ఫిష్, లైవ్ ఫిష్ రవాణా కోసం 76 మందికి డ్రై ఫిష్ యూనిట్లు, 30 మందికి ద్విచక్ర వాహనాలు, ముగ్గురికి ఆటోలను మంజూరు చేశారు. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల విలువైన బ్యాంకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.రాబోయే రోజుల్లో పిఠాపురాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లనున్నట్లు పవన్ కల్యాణ్ వివరించారు.
[Pithapuram Development, Andhra Pradesh News, Pawan Kalyan, Janasena Party, AP Deputy CM, Infrastructure, underground Drainage, Flyover, Busstand, Telugu One]


