పైలట్ స్మిత్ మచ్చర్ వీరోచిత పోరాటం: 174 మంది ప్రాణాలు కాపాడిన పైలట్‌కు అరుదైన అవార్డు.!
Published on: Thu Oct 1, 2026 6:40PM

ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయనకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన విశిష్ట గుజరాత్ గరిమా అవార్డును అందించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించారు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్1073 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. కాక్‌పిట్‌లో కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై క్రాష్ యాక్స్ వంటి వస్తువుతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ మచ్చర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు.

అదే సమయంలో విమానం ఒక్కసారిగా భారీగా కిందకు దిగింది. దాదాపు 17 వేల అడుగుల ఎత్తును కేవలం ఒక్క నిమిషంలోనే కోల్పోయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వివరాలు వెల్లడించాయి. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారినప్పటికీ.. స్మిత్ మచ్చర్ విమానాన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు ఆయన ప్రయత్నించడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లగలిగారు. అనంతరం కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించి అత్యవసరంగా సురక్షిత ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. స్మిత్ మచ్చర్ అసాధారణమైన సహనం, సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సైతం స్మిత్ ధైర్యాన్ని కొనియాడారు.

ఆయన చర్యల వల్ల భారీ విషాదం తప్పిందని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్‌కు తొలుత సౌదీ అరేబియాలోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు.స్మిత్ మచ్చర్ తెగువను గుర్తించిన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్.. ఆయన్ను ‘గుజరాతీ వీరపుత్రుడుగా అభివర్ణించారు. రక్తమోడుతున్న పరిస్థితుల్లోనూ 174 మంది ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు.గాల్లో ప్రాణాపాయం.. కళ్లముందు 174 మంది ప్రాణాలు.. ఒంటిపై తీవ్ర గాయాలు.. అయినా విమానాన్ని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
[ Pilot Smit Machchhar, Flydubai hero pilot, Gujarat Garima Award, Bhupendra Patel, Flydubai emergency landing,Heroic Indian pilot, Flydubai pilot attack, Indian pilot bravery, Dubai Tel Aviv flight incident, PM Modi supports pilot family ]


