కేంద్ర దర్యాప్తు సంస్థలకు చంద్రబాబుపై కేసులు: హైకోర్టులో పిల్.. విచారణ వాయిదా.!
Published on: Fri Oct 16, 2026 10:45AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్ హయాంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, మరికొందరిపై ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎస్సైన్డ్ భూములు, ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, లిక్కర్ పాలసీ, ఉచిత ఇసుక పథకం వంటి అంశాలపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఆ కేసులనను ఏసీబీ కోర్టు మూసివేసిందని ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టుకు తెలియజేశారు. విజయవాడకు చెందిన కే. బాలగంగాధర తిలక్ అనే వ్యక్తి 2024లో హైకోర్టులో చంద్రబాబుపై కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలకు బదలీ చేయాలంటూ పిల్ దాఖలు చేశారు.
తాజాగా ఈ పిఐఎల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం.. సిట్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు చంద్రబాబు నాయుడు, ఇతరులపై నమోదైన ఈ కేసులకు సంబంధించి సిట్ అధికారులు సమర్పించిన తుది నివేదికలను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు పరిశీలించి తగిన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసులను మూసివేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అయితే.. ఈ కేసుల కొట్టివేతను, ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు ఫిర్యాదుదారులు హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారని, అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే ఏసీబీ కోర్టు కేసులు కొట్టివేసిన నేపథ్యంలో ఈ పిల్‌పై తదుపరి విచారణ కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
మరోవైపు, పిటిషనర్ తరఫు సీనియర్ కౌన్సిల్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాకపోవడంతో, ఈ విచారణను మరో తేదీకి వాయిదా వేయాలని జూనియర్ న్యాయవాది బెంచ్‌ను అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
[Pil on Chandrababu Cases, AP High Court, ACB court, APSSDC case, Chandrababu Naidu, Telugu One]


