TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్రైస్తవాన్ని అధిగమించనుందన్న ఇస్లాం: ప్యూ రిసెర్చ్ అంచనా వెల్లడి.!

Published on: Fri Nov 20, 2026 1:52PM

ప్రపంచంలో ఇప్పటి వరకూ అత్యధిక జనాభా ఆచరించి, అనుసరించే మతంగా క్రైస్తవం  ఉంది. అయితే వచ్చే దశాబ్ద కాలంలో క్రైస్తవ మతాన్ని ఇస్లాం అధిగమించనుంది. ఈ విషయాన్ని  ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా వెల్లడించింది. ప్యూ వెల్లడించిన మత జనాభా అంచనాల ప్రకారం, రాబోయే దశాబ్దంలో ప్రపంచ మత సమీకరణాల్లో కీలక మార్పు చోటుచేసుకోనుంది. 2035 నాటికి ఇస్లాం మతం క్రైస్తవ మతాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు అనుసరించే మతంగా నిలవనుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. గత పాతికేళ్లుగా మతపరమైన జనాభా గణాంకాలపై అధ్యయనాలు చేస్తున్న ప్యూ సంస్థ, క్రైస్తవ, ముస్లిం జనాభాలు రెండూ పెరుగుతున్నప్పటికీ ముస్లిం జనాభా వృద్ధి వేగం  అధికంగా ఉందని పేర్కొంది.

ఈ వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణం సంతానోత్పత్తి రేట్లలో ఉన్న తేడా  వివరించింది. మత మార్పిడులు లేదా ఇతర మార్గాల కంటే జనన రేట్లే ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్నాయని   స్పష్టం చేసింది. ప్యూ గణాంకాల ప్రకారం, 2020–2025 మధ్యకాలంలో ముస్లిం మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 3.1గా ఉండగా, క్రైస్తవ మహిళల్లో ఇది 2.5గా నమోదైంది. ఇతర సమూహాల సగటు 1.6 మాత్రమే ఉందని, ఇది ప్రతి తరం తన సంఖ్యను నిలుపుకోవడానికి అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువని నివేదిక తెలిపింది.

2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 2.27 బిలియన్ల క్రైస్తవులు, 2.02 బిలియన్ల ముస్లింలు ఉన్నారని ప్యూ అంచనా వేసింది. కొత్త అంచనాల ప్రకారం 2035 నాటికి ముస్లింల సంఖ్య 2.57 బిలియన్లకు చేరుకుని, 2.52 బిలియన్ల క్రైస్తవులను అధిగమిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత ధోరణులు 2070 వరకు కొనసాగితే, ప్రపంచవ్యాప్తంగా ముస్లింల సంఖ్య 3.6 బిలియన్లకు పైగా చేరుకోగా, క్రైస్తవుల సంఖ్య 3 బిలియన్ల కంటే  తక్కువగా ఉంటుందని పేర్కొంది.

2020 నుంచి 2070 మధ్య ప్రధాన మత సమూహాల పరిమాణంలో వచ్చే మార్పులను,  వయస్సుల వారీ జనాభా నిర్మాణం, సంతానోత్పత్తి, మత మార్పిడి, వలసల వంటి అంశాలను ఈ పరిశోధనలో  పరిగణనలోకి తీసుకున్నారు. అమెరికాలో 40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారిలో క్రైస్తవులు మెజారిటీగా ఉండరని, ప్రస్తుతం 62 శాతంగా ఉన్న క్రైస్తవుల వాటా 2065 నాటికి 50 శాతం లోపుకు పడిపోతుందని ప్యూ అంచనా వేసింది. కెనడాలో 2030 నాటికే క్రైస్తవుల శాతం 50 శాతానికి దిగువకు వెళ్లవచ్చని, ఈ రెండు దేశాల్లోనూ ఏ మతానికీ చెందని వారి సంఖ్య పెరగడం దీనికి ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. 2070 నాటికి అమెరికాలో మత సంబంధం లేనివారు 41 శాతానికి చేరవచ్చని, కెనడాలో క్రైస్తవుల కంటే వీరి సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.

ఇది కూడా చదవండి:  దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందా? ​

2020 నుంచి 2070 మధ్య ప్రపంచ మొత్తం జనాభా 29 శాతం పెరుగుతుందని ప్యూ అంచనా వేసింది. పరిశీలించిన సమూహాల్లో కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే మొత్తం జనాభా పెరుగుదలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా వృద్ధి చెందుతారని, వీటిలో క్రైస్తవులు 30 శాతం, ముస్లింలు 80 శాతం వృద్ధి సాధిస్తారని తెలిపింది. హిందువులు, యూదుల సంఖ్య పెరిగినప్పటికీ ప్రపంచ జనాభాలో వారి శాతం తగ్గే అవకాశం ఉందని  పేర్కొంది.  మరోవైపు యూరప్‌లో 2070 నాటికి మొత్తం జనాభా 17 శాతం తగ్గుతుందని, అక్కడి క్రైస్తవుల సంఖ్య 505 మిలియన్ల నుంచి 324 మిలియన్లకు తగ్గే అవకాశం ఉందని ప్యూ పేర్కొంది. అదే సమయంలో యూరప్ జనాభాలో ముస్లింల శాతం 6 నుంచి 13 శాతానికి పెరుగుతుందని, అమెరికాలో క్రైస్తవుల సంఖ్య 2020లో ఉన్న సుమారు 217 మిలియన్ల నుంచి 2070 నాటికి సుమారు 174 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. 

భవిష్యత్తులో వివిధ దేశాల్లో జనాభా నిర్మాణం, వయస్సుల సమతుల్యత, వలసలు, సామాజిక సమీకరణాలపై ఈ మార్పులు ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా, ఆసియా, పాశ్చాత్య దేశాల్లో జనాభా వృద్ధి లేదా తగ్గుదల ఆయా ప్రాంతాల ఆర్థిక, సామాజిక పరిస్థితులతో ముడిపడి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. 

మీకు నచ్చవచ్చు:   బెంగాల్ ఎన్నికలు 2026.. ముస్లిం వీటో ఒక భ్రమ మాత్రమేనా?

98శాతం ముస్లిం జనాభా ఉన్న దేశంలో దుర్గాదేవి ఆలయం.. 300ఏళ్లుగా వెలుగుతున్న జ్వాల!

[Pew Research Center, Muslim,  Christian populations,  Population projections, Fertility Rate,  religious demographics, TeluguOne]