TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరకరలాడే, పెసర గారెలు చేసే సులువైన పద్ధతి.. ఇలా చేస్తే అద్భుతమే!

Published on: Sat Nov 7, 2026 8:14AM

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వచ్చిందంటే చాలు రకరకాల పిండి వంటలతో ఇళ్లు కళకళలాడుతుంటాయి. ముఖ్యంగా దీపావళి వేడుకల్లో సాయంత్రం వేళల్లో కమ్మని స్నాక్స్ ఉండాల్సిందే. ఈ దీపావళి పండగను మరింత రుచికరంగా మార్చుకోవడానికి  పెసర గారెలు  అద్భుతమైన ఎంపిక. ఇవి పైన కరకరలాడుతూ, లోపల ఎంతో మెత్తగా నోట్లో వెన్నలా కరిగిపోతాయి. ఈ వంటకం తయారీ విధానం ఎంతో సులభం, పైగా తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు.

ఈ కరకరలాడే పెసర గారెల తయారీ కోసం ముందుగా రెండు కప్పుల పచ్చ పెసలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. శెనగలు లేదా బొబ్బర్లతో పోలిస్తే పెసలు నాటడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, సమయం చూసుకొని ముందుగానే నానబెట్టుకోవడం ముఖ్యం. పెసలు బాగా నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 అంగుళాల అల్లం ముక్కలు, 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని కలపడం వల్ల గారెలకు ప్రత్యేకమైన ఘాటైన రుచి వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత, అదే మిక్సీ జార్‌లో నానబెట్టిన పెసలను వేసి తగినన్ని నీళ్లు జోడించి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ లూజ్‌గా కాకుండా సరైన పదునులో ఉండేలా చూసుకోవాలి.

రుబ్బిన పెసర పిండిని అల్లం మిర్చి మిశ్రమం ఉన్న గిన్నెలో వేసి కలిపి, అందులో చిన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయలు, తగినంత కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, అర టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ వంటకానికి ప్రత్యేకంగా మసాలాలు ఏవీ అవసరం లేదు, అల్లం మరియు మిరపకాయల ఘాటే దీనికి అసలైన రుచిని తెస్తుంది.

ఇది కూడా చదవండి:అమ్మమ్మల కాలం, నాటి పెసరపప్పు హల్వా.. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది!

గారెలు ఒత్తుకోవడానికి బట్టర్ పేపర్ లేదా తడిపిన ప్లాస్టిక్ కవర్ ఉపయోగించవచ్చు. పేపర్‌ను కొద్దిగా తడిపి, పిండిని చిన్న ముద్దలుగా తీసుకుంటూ మందంగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలి. మధ్యలో చిన్న రంధ్రం చేస్తే గారెలు నూనెలో సమానంగా వేగుతాయి. డీప్ ఫ్రై చేయడానికి కడాయిలో తగినంత నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె మరీ పొగలు వచ్చేలా కాకుండా సమానంగా వేడెక్కిన తర్వాత ఒత్తుకున్న గారెలను ఒక్కొక్కటిగా వేయాలి.

గారెలు వేసిన వెంటనే గరిటెతో కదపకుండా, కాసేపు వేగిన తర్వాత కడాయి అంచు నుంచి విడివడి పైకి వస్తాయి. ఆ తర్వాత నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయిస్తే గారెలు గట్టిగా మారుతాయి. ఇలా తయారు చేసుకున్న కరకరలాడే పెసర గారెలను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు.

మీకు నచ్చవచ్చు:రోజూ మినప్పప్పు తింటే, మీ శరీరానికి అందే అమేజింగ్, ఆరోగ్య ప్రయోజనాలు!

                                గుమగుమలాడే నేతి బొబ్బట్లు: ఈ కొలతలతో చేస్తే ఎప్పటికీ మెత్తగా వస్తాయి!

 

 

 

Pesara Garelu Recipe, Crispy Moong Dal Vada, Diwali Special Snacks, South Indian Festival Food, Crunchy Vada Recipe, Traditional Cooking Guide, Food Articles In Telugu.