ఎప్పుడూ దగ్గు, ఆయాసంగా ఉంటోందా..అయితే మీకు సీఓపీడీ ఉండొచ్చు జాగ్రత్త..!
Published on: Wed Nov 18, 2026 3:57PM

శరీరంలోని ప్రతి విభాగానికి ఆక్సిజన్ సక్రమంగా అందాలంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కానీ మారుతున్న జీవనశైలి, విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం, చెడు అలవాట్లు మన శ్వాస వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా సాధారణం అయిపోతున్నాయి. ముఖ్యంగా క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (Chronic Obstructive Pulmonary Disease) సీఓపీడీ అనే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కేవలం వయసు మళ్ళిన వారికే కాకుండా నలభై ఏళ్లకంటే తక్కువ వయసు ఉన్న యువతలో కూడా ఈ సమస్యల బారిన పడుతున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. ఈ వ్యాధి ముదిరినప్పుడు రోగులకు సాధారణంగా శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
world copd day..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్ నెల మూడవ బుధవారం రోజున ప్రపంచ సీఓపీడీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ దినోత్సవం సందర్భంగా శ్వాస ఆడకపోవడం లేదా ఆయాసంగా ఉందా, అయితే అది సీఓపీడీ కావచ్చు అనే ముఖ్యమైన అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు హరిస్తున్న ప్రధాన కారణాలలో మూడవ స్థానంలో ఉంది. దీనివల్ల ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అనారోగ్యానికి ప్రధాన కారణం దాదాపు డెబ్బై శాతానికి పైగా పొగాకు , ధూమపానమే అని నిపుణులు చెబుతున్నారు. సీఓపీడీ బారిన పడినప్పుడు ఊపిరితిత్తులలోని గాలి నాళాల్లో తీవ్రమైన మంట , వాపు ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లడం, బయటికి రావడంలో అవరోధం ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
ఈ సమస్యలో ఉన్న అతి పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, దీని లక్షణాలు చాలా నెమ్మదిగా బయటపడతాయి. ప్రారంభ దశలో వీటిని గుర్తించడం కష్టం కావడం వల్ల చాలా మంది సాధారణ దగ్గు లేదా వయసు మళ్లడం వల్ల వచ్చే బలహీనత అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఉదయం పూట ఎక్కువగా దగ్గు రావడం, దగ్గుతో పాటు కఫం పడటం దీని ప్రధాన లక్షణం. అలాగే కాస్త దూరం నడిచినా, మెట్లు ఎక్కినా లేదా చిన్నపాటి శారీరక పని చేసినా వెంటనే ఆయాసం రావడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగేకొద్ది ఎలాంటి పనులు చేయకపోయినా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.

ఇవే కాకుండా సీఓపీడీ సోకినప్పుడు ఛాతీలో బిగువుగా అనిపించడం, బరువుగా ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు పీపీ మంటూ శబ్దం రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో తరచుగా బ్రాంకైటిస్ లేదా నిమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా బరువు తగ్గడం, తీవ్రమైన అలసట , నీరసం కూడా ఈ వ్యాధి లక్షణాలే. కొందరిలో చలి గాలి తగిలినా లేదా కాలుష్యం బారిన పడినా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
ఇది కూడా చదవండి షుగర్ ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు పొంచి ఉందా..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
ధూమపానం , సిగరెట్, బీడీలు కాల్చే అలవాటు ఈ వ్యాధికి ప్రధాన శత్రువు. పొగత్రాగని వారితో పాటు చుట్టుపక్కల ఉండి ఆ పొగ పీల్చేవారికి కూడా ఈ ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా నగరాల్లో ఉండే తీవ్రమైన వాతావరణ కాలుష్యం, ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగించే చెక్క, బొగ్గు వంటి కట్టెల పొగ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. కొన్ని సందర్భాలలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా చిన్న వయసులోనే ఇది రావచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన చికిత్స , జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. దీనికోసం ప్రధానంగా ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కాలుష్యం , దుమ్ము ధూళి ఉండే ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ఇన్హేలర్లు వాడటం, క్రమంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో మంచిది.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..


