వైసీపీలో పేర్ని నాని సీన్ అయిపోయిందా: కార్యకర్తల సమావేశంలో అసహనం సంకేతం ఏంటి.?
Published on: Thu Oct 1, 2026 12:02PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బందర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తనదైన వాగ్ధాటితో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు రేకెత్తడానికి దోహదపడుతుంటారు. అసలు పేర్ని నాని పరిచయం అక్కర్లేని పేరు. అయితే తాజాగా ఆయన తన సహజ శైలికి భిన్నంగా ఇటీవల ఎక్కడ లేని అసహనాన్నీ ప్రదర్శించారు.
విషయమేంటంటే.. ఇటీవల బందర్ లో ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలతో పేర్ని నాని భేటీ అవ్వడం కొత్తేం కాదు. చాలా మంది నేతల కంటే చాలా చాలా ఎక్కువ సార్లు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంటారు. అలా నింపడానికి ఆయనకున్న వాగ్ధాటి దోహదపడుతుంటుంది. అందుకే పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేశారంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భేటీకి తరలి వస్తుంటారు. అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
అందుకు కారణమేంటంటే.. ఐదేళ్ల వైసిపి హయాంలో తన సొంత సామాజిక వర్గానికి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదంటూ ఈ సమావేశంలో కార్యకర్తలు పేర్ని నానిని నిలదీశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిన పేర్ని నాని.. కార్యకర్తలు నిలదీయడంతో సహనం కోల్పోయారు. పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలకు కులాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలపై ఒక్క సారిగా సామాజిక సమీకరణాలంటారేంటి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సామాజికవర్గం పేరు చెప్పుకుని ఎదిగిన నాని ఒక్కసారిగా ఇలా రివర్స్ అవ్వడమేంటంటూ విస్తుపోయారు.

తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేతకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సొంత పార్టీ నేతలకు నిలదీస్తుంటే.. వారిని సముదాయించడం చాతకాక, మంత్రి కొల్లు రవీంద్రపై నోరు పారేశసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని, తాను మాత్రం కేవలం విధేయత చూపిన వాళ్లకే పదవులు ఇచ్చాననీ పరోక్షంగా కొల్లును విమర్శిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పేర్ని తీరు, వ్యాఖ్యలు.. బందర్ లో వైసీపీ సీన్ అయిపోయిందా? లేక వైసీపీలో పేర్ని నాని సినిమా అయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి బలోపేతం అయ్యిందనీ, ఇందు కోసం మంత్రి కొల్లు రవీంద్ర చురుకుగా వ్యవహరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని నడిపించడంలో విఫలమైన నాని, డిఫెన్స్ లో పడి.. అసహనంతో రగిలిపోతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి తోడు.. తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని ఆశించిన పేర్ని కిట్టూ కూడా ప్రజాక్షేత్రంలో ఆకట్టుకోవడంలో విఫలం కావడం కూడా పేర్ని నాని అసహనానికి కరాణంగా చెబుతున్నారు.
[Perni Nani, Machilipatnam, Kollu Ravindra, Y CP , AP Politics, Andhra Pradesh Politics, Restlessness, Telugu One]


