ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.?
Published on: Fri Oct 23, 2026 12:53PM

సాధారణంగా కుటుంబంలో శుభకార్యం జరుగుతుంటే బంధాలు బలపడతాయి. విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా శుభకార్యం కోసం నడుంబిగిస్తారు. అయితే.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో మాత్రం శుభకార్యం కుటుంబ విభేదాలను మరింత పెంచుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాల అగాధాన్ని షర్మిల కుమార్తె వివాహ వేడుక మరింత పెంచినట్లు కనిపిస్తోంది. షర్మిల కుమార్తె పెళ్లి వేడుకను వైసీపీయులు రాజకీయ రచ్చ చేయడానికి ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. షర్మిల కుమార్తె వివాహం వచ్చే నెల 25న జరగనున్న నేపథ్యంలో.. బెంగళూరులోని జగన్ నివాసంలో పెళ్లి నిర్వహించాలన్న ప్రతిపాదనకు జగన్ అంగీకరించలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో కూడా దీనిపై కథనాలు వెలువడ్డాయి. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తులు, రాజకీయ విభేదాలు మరోసారి రచ్చకెక్కియి.
ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా పెద్దరికం మీదేసుకుని విభేదాల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అయితే వైఎస్ కుటుంబ పెద్దలు ఎవరూ ఇందులో జోక్యం చేసుకోకుండా వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాన్ని అన్నా చెల్లెళ్ల మధ్య మరింత చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు.

అసలింతకీ బెంగళూరు ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహం అన్న అంశం దగ్గరకు వెడితే.. బెంగళూరులోని ఎలహంకలో జగన్, షర్మిలనివాసాలు ఒకే కాంపౌండ్‌లో పక్కపక్కనే ఉన్నాయి. వారిద్దరి నివాసాలకు ప్రవేశ మార్గం ఒక్కటే. అందుకే షర్మిల కుమార్తె వివాహం అక్కడ జరగడం విషయంలో వింతా లేదు.. సప్పోజ్ ఫర్ సప్పోజ్ షర్మిల తన కుమార్తె వివాహానికి యలహంక ప్యాలెస్ ప్రతిపాదన జగన్ వద్ద చేయడంలో తప్పూలేదు. రాజకీయ, ఆస్తుల విభేదాలు శుభకార్యం జరుగుతున్నప్పుడు పక్కన పెట్టడం మంచిదని ఆమె భావించడం సహజమే. అయితే షర్మిల, జగన్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనీ, పైపెచ్చు జగన్ ప్రాణాలకు హాని ఉన్న నేపథ్యంలో ఆయనకు అత్యున్నత స్థాయి భద్రత కల్పించారనీ పేర్కొన్న పేర్ని నాని.. జగన్ వంటి హైప్రొఫైల్ వ్యక్తి నివసించే కాంపౌండ్‌లో పెళ్లి వేడుక నిర్వహించడం సాధ్యం కాదని, అయినా ఆయన నివాసమేమీ ఫంక్షన్ హాల్ కాదనీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పెళ్లంటే అతిథులు రావడం, క్యాటరింగ్ సిబ్బంది, డెకరేషన్ వాళ్లు, ఇతర పనివాళ్ల రాకపోకలు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయనీ పేర్కొన్న పేర్ని నాని, షర్మిల ఒక వేళ యలహంక ప్యాలెస్ లో తన కుమార్తె పెళ్లి అన్న ప్రతిపాదన చేసి ఉంటే అది తప్పు అని చెప్పారు.
అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే.. ఈ విషయంలో పేర్ని నాని ఎందుకు మాట్లాడారన్నదే. పెళ్లి ఎక్కడ, ఎలా జరగాలి అన్నది కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశం. దానికి రాజకీయ వివరణలు, మీడియా విమర్శలతో బయటి వారు జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
పేర్ని నాని జోక్యం జగన్, షర్మిల మధ్య విభేదాలను మరింత రెచ్చగొట్టేవిగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల నిజంగా ఎలహంక ప్యాలెస్ లో తన కుమార్తె వివాహం అన్న ప్రతిపాదనను జగన్ వద్ద చేశారా? అందుకు జగన్ తిరస్కరించారా? తిరస్కరిస్తే ఆయన చెప్పిన కారణాలు ఉమిటి? అన్న ప్రశ్నలకు వివరణ లేదా సమాధానం అంటూ వస్తే అది జగన్ నుంచి, షర్మిల నుంచీ రావాలి. కానీ పేర్ని నాని ఎందుకు మధ్యలో గొంతు సవరించుకుని మాట్లాడుతున్నారన్న ప్రశ్న అటు రాజకీయవర్గాలలో, ఇటు వైఎస్ కుటుంబ సభ్యులలో వినవస్తోంది.
[Perni Nani stoking Divisions Between Jagan YS Sharmila, Sharmila Daughter Marriage, alahanka Palace, Telugu One]


