అమెరికాలో ఇండియన్ టెక్కీలకు చిక్కులు: గ్రీన్ కార్డ్ ఇక దుర్లభమే.!
Published on: Fri Oct 9, 2026 11:35AM

అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న ఇండియన్ ఐటీ నిపుణులకు ఆశాభంగం తప్పదు అనే పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉద్యోగ ఆధారిత శాశ్వత నివాస ప్రక్రియలో కీలకమైన పిఈఆర్ఎమ్ ప్రోగ్రాం కింద ఎనిమిది దిగ్గజ సంస్థల దరఖాస్తులపై సస్పెన్షన్ ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియాకు చెందిన దిగ్గజ కంపెనీలు టీసీసీ, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్ తో పాటు, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, అడోబ్, క్యాప్‌జెమినీ ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల ద్వారా గ్రీన్‌కార్డ్ పొందాలనుకునే ఉద్యోగుల భవిష్యత్తు డోలాయమానంలో పడింది.
అమెరికా ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది. కొన్ని సంస్థలు విదేశీ ఉద్యోగులను తక్కువ వేతనాలకు నియమించుకుంటూ, అమెరికా ఉద్యోగుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బాహాటంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీల నియామక విధానాలు, వీసా కార్యక్రమాల వినియోగంపై విచారణలు జరుగుతున్నాయనీ, అందుకే విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు ఈ సస్పెన్షన్ విధించామనీ చెప్పుకొచ్చారు.
అమెరికాలో ఉద్యోగ ఆధారంగా గ్రీన్‌కార్డ్ పొందేందుకు ఉపయోగించే మార్గాల్లోపీఈఆర్ఎమ్ కీలకం. ఈ ప్రక్రియలో సంబంధిత ఉద్యోగానికి అర్హులైన అమెరికా ఉద్యోగులు అందుబాటులో లేరని, విదేశీ ఉద్యోగిని నియమించడం వల్ల స్థానిక ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఉండదని యజమాని నిరూపించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ ధ్రువీకరణ అనంతరం గ్రీన్‌కార్డ్ దరఖాస్తులో తదుపరి దశలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ఈ నిర్ణయంపై భారతీయ ఉద్యోగుల్లో నెలకొన్న ప్రధాన సందేహం ఏమిటంటే హెచ్1బి వీసా రద్దైనట్లేనా అన్నది. అయితే.. పీఈఆర్ఎమ్ సస్పెన్షన్ హెచ్1 బీ వీసా రద్దు కాదు. హెచ్1 బీ నిర్దిష్ట నిబంధనల ప్రకారం అమెరికాలో తాత్కాలికంగా పనిచేసేందుకు ఉపయోగించే వీసా.పీఈఆర్ఎమ్ యజమాని ఆధ్వర్యంలో శాశ్వత నివాసం పొందే ప్రక్రియలో కీలక దశ. కాబట్టి ఈ చర్య వల్ల ప్రభావిత కంపెనీల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వెంటనే ఉద్యోగం లేదా వీసా కోల్పోతారనుకోవడం సరికాదు.
ఇప్పటికే పీఈఆర్ఎమ్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవారితో పాటు కొత్తగా ఈ ప్రక్రియ ప్రారంభించాలనుకునే ఉద్యోగులపై మాత్రమే ఈ సస్పెన్షన్ ప్రభావం పడుతుంది. అలాగే.. హెచ్1 బీ వీసా గడువు పరిమితికి చేరువలో ఉన్నవారు జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయంపై ఐటీ పరిశ్రమలోనూ స్పందనలు వెలువడ్డాయి. భారత ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ ప్రకారం, నైపుణ్యాల కోసం తాత్కాలికంగా విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం, శాశ్వత నివాసం కల్పించడం రెండు వేర్వేరు అంశాలని పేర్కొంది. భారతీయ ఐటీ సంస్థలు అమెరికాలో స్థానిక నియామకాలను పెంచుతూ,హెచ్1 బీపై ఆధారపడటాన్ని తగ్గించాయని తెలిపింది. టీసీఎస్ కూడా ఈ నిర్ణయం తమ ఉద్యోగ వ్యూహం లేదా కస్టమర్లకు అందించే సేవలపై ఏ మాత్రం ప్రభావం చూపదని పేర్కొంది. అయినా గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో ఉన్న కొందరు ఉద్యోగులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
[PERM Suspenssion Effect Indian Techies, Donald Trump, Green Card, H1B visa, PERM Program, TCS, Infosys, Wipro, HCLTech, Indian IT Employees, US Immigration Policy]


