TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పుంగనూరు హింస వెనుక పెద్దిరెడ్డి కుటుంబం కుట్ర: బీసీవై అధినేత రామచంద్రయాదవ్ సంచలన ప్రకటన.!

Published on: Fri Oct 16, 2026 4:15PM

స్థానిక ఎన్నికల వేళ పుంగనూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.   మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం తొలిరోజే   ఘర్షణలకు వేదికగా  మారింది.  అయితే ఈ పరిస్థితి తలెత్తడం వెనుక వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుంగనూరులో శుక్రవారం (అక్టోబర్ 16)న జరిగిన ఘర్షణలు పెద్దిరెడ్డి రామచందరారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పక్కా వ్యూహం ప్రకారం నడిపిన కుట్ర  అన్నారు బీసీవై  అధ్యక్షుడు రామచంద్రయాదవ్. ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రకు తాను స్వయంగా ప్రత్యక్ష సాక్షినని ప్రకటించి సంచలనం సృష్టించారాయన. 

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో  ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నామినేషన్ దాఖలు చేసేందుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేంద్రానికి చేరుకున్న తరుణంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో ఎంపీ కాన్వాయ్‌లోని వాహనాలు తమ కార్యకర్తలపైకి దూసుకెళ్లాయని, వైసీపీ వర్గీయులు భౌతిక దాడికి దిగారని తెలుగుదేశం వర్గీయులు అంటున్నారు.  ఈ సందర్భంగా మిథున్ రెడ్డి వాహన శ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారి,   నామినేషన్ల కేంద్రం ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఇరువర్గాల నినాదాలు, తోపులాటలతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.

ఈ పరిణామాలపై స్పందించిన రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, పుంగనూరులో చెలరేగిన హింస యాదృచ్ఛికం కాదని, ముందే పక్కాగా రచించిన పథకం అని ఆరోపించారు. తాను దీక్షలో ఉన్న సమయంలో రాత్రి వేళ మేడపైకి వెళ్లగా, పక్కనే ఉన్న గెస్ట్ హౌస్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి తన అనుచరులు,  గూండాలతో సమావేశమై ఈ దాడులకు సంబంధించిన వ్యూహాన్ని రూపొందించడాన్ని గమనించాననీ,  ఆ కుట్రను, పన్నాగాలను తాను  స్వయంగా కళ్లారా చూశానని పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలను భగ్నం చేసేందుకే పెద్దిరెడ్డి కుటుంబం  ఈ తరహా హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. 

ఈ అల్లర్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై  పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.  స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు.  ఇదే తరహాలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా నామినేషన్ల కేంద్రాల వద్ద   ఘర్షణలు చోటుచేసుకున్నాయి.  పుంగనూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్నందున, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎన్నికల సంఘం,  యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.  

[Peddireddy Family Conspiracy Behind Punganuru Violance, Punganur Attacks, Ramachandra Yadav, Mithun Reddy, Telugu One]