పెడన మునిసిపల్ చైర్ పర్సన్ గా జనసేన అభ్యర్థిజ్యోత్స రాణి: 4 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం.!
Published on: Tue Nov 3, 2026 1:54PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి స్పష్టమైన ఆధిక్యత చాటుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతున్న వేళ, కృష్ణాజిల్లాలోని కీలకమైన పెడన మున్సిపాలిటీలో జనసేన పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. పెడన మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠానికి జరిగిన పోరులో జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి తన ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రతి రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యాన్ని పెంచుకుంటూ , అంతిమంగా తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై 4 వేల 380 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

స్థానిక సంస్థల ఎన్నికల పొత్తు ఒప్పందంలో భాగంగా పెడన మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాన్ని కూటమి పక్షాలు జనసేనకి కేటాయించాయి. ఈ కేటాయింపునకు పూర్తి న్యాయం చేస్తూ జనసేన నాయకత్వం, శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాయి. తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసేన అభ్యర్థితో కలిసికట్టుగా పనిచేయడం, ఓటర్లలో నమ్మకాన్ని కలిగించడం ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించాయని పరిశీలకులు అంటున్నారు.
ఈ విజయంతో పెడన పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితం వెలువడగానే జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
[Pedana Municipal Election Results, Janasena Candidate Jyotsna Rani Win, Pedana Municipal Chairperson SeatAP Municipal Elections, Alliance Victory, Telugu One]


