నోరు పారేసుకోవద్దు.. కేసీఆర్‌కి పవన్ సూచన

 

సూచన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ కళ్యాణ్ ఇంట్లో లేని విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ సర్వేలో పాల్గొనలేదన్న విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ మీద వెటకారంగా కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో టూరిస్టులా వుంటాడేమోనని వ్యంగ్యంగా మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ‘‘సమగ్ర సర్వే జరిగిన రోజు నేను హైదరాబాద్‌లో లేను. పైగా సమగ్ర కుటుంబ సర్వే ఐచ్ఛికమని, ఇష్టంలేనివాళ్ళు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు చెప్పింది. సర్వే ఐచ్ఛికమని నేను సర్వేలో పాల్గొనలేదు. ఆమాత్రం దానికే కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడటం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ విద్వేష పూరితంగా మాట్లాడడం సమంజసం కాదు. బాధ్యత కలిగిన నాయకులు నోరు పారేసుకోవడం మంచిది కాదు.. పదే పదే విద్వేషాలు రెచ్చగొడితే సమాజంలో అశాంతి ఏర్పడుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్న విషయాన్ని తెలుసుకుని ఎవరైనా మాట్లాడాలి’’ అన్నారు.