పార్టీ రెబల్స్ కు జనసేనాని హెచ్చరిక: నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆదేశం.!
Published on: Tue Oct 27, 2026 3:40PM

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులు, ఆశావహులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, పార్టీ అధికారికంగా కేటాయించిన బీఫామ్‌ల ఆధారంగా పోటీ చేసే అభ్యర్థుల విజయం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీఫామ్ లేకుండా పోటీలో నిలవాలని భావిస్తున్న రెబల్స్ తక్షణమే తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.
వివిధ రాజకీయ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎంతో క్లిష్టమైన సవాల్‌తో కూడుకున్నదైప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ, కూటమి పార్టీల సమన్వయంతో ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించినట్లు పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యిందనీ, అభ్యర్థుల తుది జాబితాను ఖరారు అయ్యిందనీ చెప్పిన పవన్ కల్యాణ్.. కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని విస్పస్ట హెచ్చరిక జారీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే లోపు రెబల్స్ సమస్యను పూర్తిగా పరిష్కరించుకుని, కూటమి బలాన్ని మరింత ఏకతాటిపైకి తీసుకురావాలని జనసేన అధినేత విస్పష్టంగా చెప్పారు.
.webp)
గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రదర్శించిన ఐక్యత వల్లే అఖండ విజయం సాధ్యమైందని, అదే స్ఫూర్తిని ఇప్పుడు స్థానిక పోరులోనూ కొనసాగించాలన్నారు. పార్టీ కోసం కష్ట కాలంలో నిలబడి త్యాగాలు చేసిన నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్తులో సముచితమైన ప్రాధాన్యత కల్పిస్తామని, ఎవరికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు.
పార్టీ శ్రేణులు వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి, కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్న కీలక సమయంలోనే తుపాను ముప్పు ముంచుకొచ్చిందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సమర్థవంతంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తక్షణ చర్యలు తీసుకున్నారని కొనియాడారు. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ యంత్రాంగం, నాయకత్వం సమన్వయంతో పనిచేసిన తీరు ప్రజలకు భరోసా కల్పించిందన్నారు
[Pawan Kalyan Caution Rebel Candidates, Ap Local Body Elections, Janasena Rebels, Allience Unity, Alliance Seat Sharing, Telugu One]


