పవన్ వంగవీటి భేటీ: సంకేతమేంటి?
Published on: Fri Sep 25, 2026 3:47PM

స్థానిక ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ కావడం పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక సమావేశమే అని ఇటు వంగవీటి రాధా, అటు పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటికీ..రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరిగిందని అంటున్నారు.

అలాగే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ ముచ్చటించుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల వేళ పవన్ కల్యాణ్, వంగవీటి రంగా భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ స్థానక సమరంలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.
[Pawan Kalyan, Vangaveeti Radha Krishna, AP Local Body Elections, Mangalagiri Camp office, Janasena Party, AP Politics, Telugu One]


