పవన్ ఇలా చేస్తాడని ఎన్నడూ అనుకోలేదు...

 

గత నాలుగేళ్ల నుండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చాలా సన్నిహత సంబంధం ఏర్పడింది. ఈ నాలుగేళ్లలో పవన్ వైసీపీ పై విమర్శలు గుప్పించడమే కానీ.. ప్రభుత్వాన్ని పెద్దగా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా సమస్యపై పవన్ ప్రభుత్వాన్ని నిలదీసిన.. ఈ పని చేయాలని డిమాండ్ చేసినా.. వెంటనే చంద్రబాబు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. అలా ఇద్దరి మధ్య చాలా కోఆర్డినేషన్ ఉండేది. అంతలా పవన్ ను చంద్రబాబు నమ్మారు. అయితే ఉన్నట్టుండి పవన్ యూటర్న్ తీసుకొని టీడీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు.

 

జనసేన పార్టీ ఆవిర్భావం రోజు నుండి ఈరోజు వరకూ పవన్ టీడీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక పవన్ చేసిన విమర్శలపై స్పందించిన టీడీపీ నేతలు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు అయితే పవన్ పై నిప్పులు చెరిగారు. తాజాగా నేషనల్ మీడియాతో మాట్లాడిన పవన్... మరోసారి టీడీపీపై, చంద్రబాబుపై విమర్సలు గుప్పించారు. దీంతో ఈ ఉదయం ఎంపీలతో సుదీర్ఘ టెలీ కాన్ఫరెన్స్  నిర్వహించిన ఆయన.. పవన్ వ్యాఖ్యలపై స్పందించి తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలతో ఇంత డ్యామేజ్ చేస్తారని ఎన్నడూ అనుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారట. వివిధ కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నామని పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన కుమారుడు లోకేష్ పై పవన్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని మరోసారి తేల్చి చెప్పారు.

 

తన స్వార్థ ప్రయోజనాల కోసం మరొకరి ప్రయోజనాల కోసం పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పవన్ వంటి వ్యక్తి ఓ విమర్శ చేసేముందు నిజానిజాలను తెలుసుకోవాలని.. తెలుగు ప్రజలు ఎంతో అభిమానించే నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని అన్నారు. మొత్తానికి పవన్ ను ఇంతలా నమ్మిన చంద్రబాబుకు.. పవన్ ఇలా చేస్తాడని కనీసం కలలో కూడా అనుకోని ఉండరు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ ఇప్పుడే ఏకంగా చంద్రబాబుపై, ఆయన తనయుడిపైనే డైరెక్ట్ గా విమర్శలు గుప్పించడంతో చంద్రబాబు బాగానే ఫీలవుతున్నట్టున్నారు.