TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆకలితో ఉంటే స్వర్గానికి వెళ్తారట.. 191 మందిని బలిగొన్న మూఢనమ్మకం.!

Published on: Tue Oct 20, 2026 2:51PM

 దేవుణ్ని కలుస్తామంటూ 191 మందిని ఆకలితో పొట్టనబెట్టుకున్న మతబోధకుడు.!

కెన్యా దేశంలో సంచలనం సృష్టించిన భయానక ఆకలి చావుల ఉదంతంలో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. స్వయం ప్రకటిత మతబోధకుడు పాల్‌ మెకెంజీతో పాటు మరో 28 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. అమాయక ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని, వారిని పొట్టనబెట్టుకున్న ఈ దారుణ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

మతబోధకుడు పాల్‌ మెకెంజీ తన అనుచరులను విపరీతమైన భావజాలంతో ప్రభావితం చేశాడు. యేసు క్రీస్తును నేరుగా కలుసుకోవాలంటే ప్రాపంచిక సుఖాలను వదిలేయాలని, ఆహారం తీసుకోకుండా కఠినమైన ఉపవాసాలతో ప్రాణాలు విడవాలని నమ్మబలికాడు. ఈ ప్రచారంతో మోసపోయిన వందలాది మంది ఆయన మాటలను గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

కెన్యా తీర ప్రాంతంలోని మాలిండి సమీపంలో ఉన్న దట్టమైన షకహోలా అటవీ ప్రాంతం ఈ ఘోరానికి వేదికైంది. మెకెంజీ ఆధీనంలో ఉన్న సుమారు 800 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ప్రాంతంలో అనుచరులను ఉంచి క్రూరమైన ఆంక్షలు విధించారు. మొదట చిన్న పిల్లలు, ఆ తర్వాత టీనేజర్లు, మహిళలు, చివరగా పురుసులు క్రమపద్ధతిలో ఆకలికి బలయ్యేలా ఒక వ్యవస్థను నడిపినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో నిరూపించింది.

 దేవుణ్ని కలుస్తామంటూ 191 మందిని ఆకలితో పొట్టనబెట్టుకున్న మతబోధకుడు.!

ఈ కేసు విచారణ సందర్భంగా వెలుగుచూసిన నిజాలు అధికారులను సైతం నివ్వెరపరిచాయి. మృతుల్లో అత్యధికంగా 190 మంది చిన్నారులు ఉండటం అందరినీ కలచివేసింది. కొందరు ఆకలితో మరణించగా, మరికొందరిని ఊపిరాడకుండా చేసి, తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలు స్పష్టం చేశాయి. కన్న తల్లులే తమ పిల్లలను సైతం ఆకలితో అలమటించి చనిపోయేలా చేసిన వైనం మానవత్వాన్ని మంటగలిపింది.

మొంబాసా కోర్టు న్యాయమూర్తి డయానా కవెడ్జా మొచాచే ఈ కేసుపై సోమవారం తుది తీర్పును వెల్లడించారు. నిందితుల నేరాలు రుజువు కావడంతో మెకెంజీతో పాటు సహచరులను దోషులుగా తేల్చారు. ఈ ఘోరానికి పాల్పడిన మత సంస్థలు అనుచరులను బయటి ప్రపంచానికి దూరం చేసి, వారిపై మానసిక ఆధిపత్యం చెలాయించాయని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ దారుణ కాండలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు కొంతమేర ఊరట చెందుతున్నప్పటికీ, వారి గుండెల్లో గూడుకట్టుకున్న శోకం ఇంకా వీడలేదు. తమ అత్మీయులు ఎప్పటికీ తిరిగిరారన్న వేదనను వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, దోషిగా తేలిన మెకెంజీ తరఫు న్యాయవాదులు ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్‌ చేస్తామని వెల్లడించారు. నవంబర్‌ 6న నిందితులకు శిక్షలను ఖరారు చేసే అవకాశం ఉంది.

ఈ భయానక ఉదంతం వెలుగులోకి రావడంతో కెన్యా ప్రభుత్వంతో పాటు ఆ దేశ మానవ హక్కుల సంఘాలు అప్రమత్తమయ్యాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న అక్రమ మత సంస్థలు, కల్ట్‌ల కార్యకలాపాలపై కఠినమైన నియంత్రణలు విధించాలని ప్రజలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి దురాచారాలకు పాల్పడే సంస్థలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని భవిష్యత్ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

 

 

 

[ Paul Mackenzie conviction, Kenya starvation cult, Shakahola Forest massacre, Kenya cult deaths, Paul Mackenzie conviction, Kenya cult deaths,Good News International Ministries ]