INTERVALలో తెలంగాణ వంటకం: ప్యారడైజ్ మూవీ చూసే వారికి.. అదిరిపోయే Surprise.!
Published on: Wed Sep 23, 2026 7:18PM

ప్యారడైజ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్ సిద్ధమైంది. తెరపై నాని యాక్షన్ సందడి చేస్తుంటే.. ఇంటర్వెల్‌లో తెలంగాణ సంప్రదాయ రుచి ప్రేక్షకులను పలకరించనుంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన *‘ది ప్యారడైజ్’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో కయాదు లోహర్ కథానాయికగా నటించారు. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుండగా.. ఇప్పటికే ప్రీమియర్స్‌కు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ విషయం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.‘ది ప్యారడైజ్’ను థియేటర్‌లో చూసే ప్రేక్షకులకు ఇంటర్వెల్‌లో తెలంగాణ ఫేమస్ స్నాక్ ‘సర్వపిండి’ని అందించేందుకు మైత్రీ థియేటర్స్ సిద్ధమైంది. తెలంగాణ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సర్వపిండిని.. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ఇంటర్వెల్ స్నాక్‌గా అందించనున్నట్లు మైత్రీ థియేటర్స్ ప్రకటించింది. మైత్రీ విమల్, మైత్రీ శివ గంగా థియేటర్లలో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
అంతేకాదు.. ఏకంగా 77 ఏళ్ల బామ్మ స్వయంగా సర్వపిండిని తయారు చేయనున్నట్లు థియేటర్స్ యాజమాన్యం వెల్లడించింది. సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా.. తెలంగాణ మట్టి వాసన, స్థానిక సంస్కృతి, సంప్రదాయ ఆహారపు రుచిని కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నట్లు మైత్రీ థియేటర్స్ తెలిపింది. దీంతో నాని ‘ప్యారడైజ్’ను తెరపై చూడటంతో పాటు.. ఇంటర్వెల్‌లో తెలంగాణ సాంప్రదాయ సర్వపిండి రుచిని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


