TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ.. తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. నష్టపోతారు..!

Published on: Wed Sep 30, 2026 9:39AM

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో బొప్పాయి పండుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  పీచు పదార్థాలు, విటమిన్లు, అలాగే జీర్ణక్రియకు దోహదపడే పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఎంతో సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున లేదా సాయంత్రం వేళల్లో బొప్పాయిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఎంతటి ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని తినే విధానం సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా బొప్పాయిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే అటువంటి కొన్ని ఆహార కలయికల గురించి వివరంగా తెలుసుకుంటే..

పాలు , డైరీ ఉత్పత్తులు..

చాలామంది పండ్లతో పాటు పాలు లేదా ఇతర పాల పదార్థాలను తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది పండ్లతో మిల్క్ షేక్ తీసుకోవడానికే ఇష్టపడతారు.  కానీ బొప్పాయిని పాల ఉత్పత్తులతో కలిపి తీసుకున్నప్పుడు అందులోని ఎంజైములు రియాక్షన్ జరిపి కడుపులో గ్యాస్, యాసిడిటీ , ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి. జీర్ణవ్యవస్థపై ఇది తీవ్రమైన భారాన్ని పెంచి పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

 అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు..

బొప్పాయిలోని ఎంజైములు ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయగలవు. అయితే మాంసం, గుడ్లు లేదా పప్పు ధాన్యాలు వంటి అధిక ప్రోటీన్ కలిగిన భారీ ఆహారాలతో బొప్పాయిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో తేడా జరుగుతుంది.  కాబట్టి బొప్పాయిని ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారంతో మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం.

నూనెలో వేయించిన పదార్థాలు..

బొప్పాయి వేగంగా అరిగిపోయే గుణం కలిగి ఉండే పండు, కానీ వేపుళ్లు లేదా నూనె పదార్థాలు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థ  సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో భారం, అసౌకర్యం , గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తినగానే పండ్లు తినే అలవాటు ఉండేవారు నూనెలో వేయించిన ఆహారాలు తిన్న వెంటనే బొప్పాయి తినడం అంత మంచిది కాదు.

 పులియబెట్టిన లేదా ఈస్ట్ తో తయారు చేసిన ఆహారాలు..

 ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆహార పదార్థాలతో బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి.

అరటిపండు కాంబినేషన్..

అరటిపండు,  బొప్పాయి రెండూ పండ్లే అయినప్పటికీ, అరటిపండు , బొప్పాయిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణక్రియ వేగం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఎప్పుడూ  కడుపు నిండిపోయినట్లు, భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

కాబట్టి బొప్పాయి ఇచ్చే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దాన్ని ఇతర ఆహారాలతో కలపకుండా విడిగా మాత్రమే తినడం మంచిది. అది కూడా ఆహారం తీసుకున్న వెంటనే కాకుండా కనీసం అరగంట నుండి గంట సమయం వ్యవధి ఇచ్చి పండిన బొప్పాయిని సరైన మోతాదులో తీసుకుంటే  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 
 
                                                                                                                                                 *రూపశ్రీ.