TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులితో వీడియో షూటింగ్..ఊహించని విషాదం..19 ఏళ్ల యువకుడు మృతి.!

Published on: Sat Nov 14, 2026 3:32PM

సోషల్ మీడియాలో నాలుగు లైకులు.. మరికొన్ని వేల వ్యూస్.. ఇంకాస్త పాపులారిటీ కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు కొందరు. కానీ ఆ సరదా ప్రయత్నాలు ఒక్కోసారి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. పాకిస్థాన్‌లో టిక్‌టాక్ వీడియో షూటింగ్ కోసం బోనులో ఉన్న పులిని బయటకు తీయగా.. ఆ క్రూరమృగం దాడిలో 19 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ రీల్ కోసం మొదలైన ప్రయత్నం.. చివరకు ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని లాహోర్ శివారు ప్రాంతమైన కాహ్నాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నోమాన్ హసన్ ఓ వైల్డ్‌లైఫ్ బ్రీడింగ్ ఫాంహౌస్‌కు వెళ్లాడు. అక్కడ వినూత్నంగా వీడియోలు చిత్రీకరించాలనే ఉద్దేశంతో బోనులో ఉన్న ఆడ పులిని బయటకు తీసుకురావాలని ఫాంహౌస్ నిర్వాహకులను కోరాడు.

ఇన్‌ఫ్లుయెన్సర్ కోరిక మేరకు నిర్వాహకులు పులిని బోను నుంచి బయటకు వదిలారు. అంతే.. అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారయ్యాయి. కెమెరాల ముందు వీడియో షూటింగ్ జరుగుతుండగా పులి అకస్మాత్తుగా దాడికి దిగింది. అక్కడే పనిచేస్తున్న 19 ఏళ్ల తల్హాపై విరుచుకుపడింది. ఊహించని ఈ దాడితో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటన జరిగిన సమయంలో తల్హా తండ్రి మునీర్ అహ్మద్, సోదరుడు హషిమ్ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు అతడిని కాపాడలేకపోయారు. కళ్లముందే కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి గుండె పగిలేలా విలపించాడు. తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

ఇది కూడా చదవండి: గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ భరోసా.. ప్రతి డెలివరీపై 1 శాతం సంక్షేమ నిధికి.!

అయితే ఈ ఘటన తర్వాత మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడి మృతికి పులి దాడి కారణం కాదని, కుక్క కరిచినందువల్లే చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన అధికారులు అసలు విషయం బయటపెట్టారు. ఫాంహౌస్ యజమాని ఫయ్యాజ్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నోమాన్ హసన్‌లను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఆ ఫాంహౌస్‌లో పులిని పెంచేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? ప్రమాదం జరిగిన తర్వాత వాస్తవాలను దాచిపెట్టేందుకు ఎవరు ప్రయత్నించారు? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పులిని వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించినట్లు సమాచారం.

ఒక వీడియో కోసం.. మరికొన్ని లైకుల కోసం.. ప్రాణాలతో చెలగాటం ఆడితే జరిగే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. కెమెరా ముందు క్షణాలపాటు కనిపించే పాపులారిటీ కోసం ఓ యువకుడు తన నిండు జీవితాన్ని కోల్పోయాడు. అతడి కుటుంబానికి మాత్రం ఈ విషాదం జీవితాంతం మాయని గాయంగా మిగిలిపోనుంది.

మీకు నచ్చవచ్చు: స్వీట్ అనుకుని నోట్లో పెట్టుకున్నాడు..క్షణాల్లో పేలిన నాటు బాంబు.!

మీకు నచ్చవచ్చు: కంగనా రనౌత్‌పై కేసు నమోదు...ఎందుకంటే.!

 

 

[ Pakistan TikTok Influencer,  Noman Hassan, Lahore Tiger Attack, Social Media Reels Tragedy, 19 Year Old Youth Death ]