TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాకిస్థాన్ లో వందేళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.!

Published on: Tue Sep 1, 2026 10:48AM

పాకిస్థాన్‌లో మైనారిటీల ప్రార్థనా మందిరాలు, చారిత్రక వారసత్వ సంపదపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ధం పైగా చరిత్ర కలిగిన ఒక పురాతన హిందూ దేవాలయం  నేలమట్టమైంది. లాహోర్‌కి   130 కిలోమీటర్ల దూరంలో నారోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలోని  నూటపాతికేళ్ల  125 ఏళ్ల పురాతన ఆలయం కూల్చివేతకు గురైంది. వెయ్యి చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించిన ఈ ఆలయాన్ని గత నెల 21న  కూల్చివేశారని స్థానిక హిందువులు,  మైనారిటీ హక్కుల సంఘాలు తెలిపాయి. కూల్చివేయడమే కాకుండా..   ప్రాంగణంలో ఉన్న ఇటుకలు, గోడల నిర్మాణాలు, శిఖరంపై అమర్చిన ఖరీదైన లోహపు రాడ్లు,  ఇతర విలువైన సామగ్రిని సైతం అక్రమార్కులు దోచుకెళ్లారు. 

ఈ దారుణ కూల్చివేత వెనుక నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ)   నాయకుల  ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని గతంలో ఒక మదర్సా నిర్వహణ కోసం  ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్  లీజుకు ఇచ్చింది. అయితే నిబంధనల ప్రకారం క్రమం తప్పకుండా అద్దె చెల్లించకపోవడంతో పాటు అనేక లీజు నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడంతో అధికారులు ఆ లీజును రద్దు చేశారు. రద్దు ఉత్తర్వులు వచ్చినా అక్రమార్కులు ఆ స్థలాన్ని ఖాళీ చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. అంతేకాకుండా నెమ్మదిగా ఆలయానికి సంబంధించిన గదులను, పక్కనే ఉన్న ఖాళీ భూమిని కూడా కబ్జా చేశారు. చివరకు గుడి గుర్తునే పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆ ప్రాంగణాన్ని మదర్సా విస్తరణలో కలిపేసుకోవడానికి ఆగస్టు 21న ఈ విధ్వంసానికి ఒడిగట్టారని అంటున్నారు. 

మరోవైపు తమ దేశంలో మైనారిటీల ఆస్తులకు మరియు మత స్వేచ్ఛకు రక్షణ లేదనే పచ్చి నిజం ప్రపంచం ముందు పటాపంచలు కాకుండా ఉండేందుకు పాకిస్థాన్ ఇది కూల్చివేత కాదని బుకాయిస్తోంది. భారీ వర్షాల కారణంగానే పురాతన దేవాలయం కూలిపోయిందంటూ సాకులు చెబుతూ ప్రపంచాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తోంది.  అంతే కాకుండా పైగా తమ రికార్డుల్లో అసలు ఆ దేవాలయం  నమోదు కాలేదంటోంది.  తమ పవిత్ర స్థలాన్ని కళ్లముందే నాశనం చేసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని నారోవాల్ జిల్లా శాంతి కమిటీ  ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ కూల్చివేతపై  నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, ధ్వంసమైన వంద ఏళ్ల నాటి చారిత్రక ఆలయాన్ని ప్రభుత్వం సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని  మైనారిటీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


[Pakistan Hindu temple demolition, Narowal temple news, Pakistan minorities status, Punjab province Pakistan, TLP temple attack, Evacuee Trust Property Board]