TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాకిస్తాన్‌కు చైనా, టర్కీ రహస్య ఆయుధ సరఫరా.!

Published on: Sat Aug 22, 2026 3:21PM

దక్షిణాసియా ప్రాంతంలో వ్యూహాత్మక భద్రతా సమీకరణాలు   వేగంగా మారుతున్నాయి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలకు చైనా, టర్కీ దేశాలకు చెందిన భారీ సైనిక రవాణా విమానాలు ఒకదాని వెనుక ఒకటి వచ్చి చేరుతుండటం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో   కలకలం రేపుతోంది. గత 60 గంటల వ్యవధిలోనే పాక్ భూభాగంలో ఈ రకమైన అసాధారణ సైనిక విమానాల కదలికలు నమోదైనట్లు భారత నిఘా వర్గాలు సైతం గుర్తించాయి. రావల్పిండి సమీపంలోని  నూర్ ఖాన్ ఎయిర్ బేస్, కరాచీలోని మస్రూర్ ఎయిర్ బేస్, పంజాబ్ ప్రావిన్స్‌లోని మురిద్ ఎయిర్ బేస్‌లకు అత్యంత వేగంగా ఆయుధ సామగ్రి రవాణా జరుగుతోందని భద్రతా ఏజెన్సీలు నివేదించాయి. 

ఈ పరిణామాన్ని  సాధారణ ద్వైపాక్షిక సంబంధంగా చూడలేమనీ.. భారతదేశ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా సైనిక బలాన్ని పెంచే దిశగా జరుగుతున్న భారీ లాజిస్టిక్స్ ఆపరేషన్ గా భారత రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.  ఈ సైనిక సామగ్రి తరలింపు వెనుక ఉన్న సాంకేతిక,  కార్యాచరణ వివరాలను పరిశీలిస్తే..  టర్కీ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బస్ ఏ400మ్  అట్లాస్ విమానం ఇస్తాంబుల్ నుండి బయలుదేరి పాకిస్తాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంలో ల్యాండ్ అయ్యింది. దీనిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషణలు ధృవీకరించాయి. ః

పంజాబ్‌చక్వాల్ జిల్లాలో ఉన్న మురిద్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ డ్రోన్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసి మురిద్ ఎయిర్ బేస్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి, అలాగే సరికొత్త కామికేజ్, వైమానిక డ్రోన్‌లను సమకూర్చడానికి టర్కీ నుండి ఈ రవాణా సాగుతున్నట్లు భావిస్తున్నారు. అదే సమయంలో చైనాకు చెందిన సైనిక రవాణా విమానాలు కరాచీ, రావల్పిండిలోని వ్యూహాత్మక స్థావరాలకు పదేపదే ప్రయాణాలు చేయడం ఈ సరఫరా తీవ్రతను స్పష్టం చేస్తోంది.  

చైనా,  టర్కీల నుండి పాకిస్తాన్‌కు అందుతున్న ఈ సైనిక మద్దతుకు చారిత్రక నేపథ్యం  ఉంది. చైనా దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్  నివేదికల ప్రకారం చైనా రక్షణ ఎగుమతుల్లో   40 శాతం ఒక్క పాకిస్తాన్‌కే వెళ్తున్నాయి. పాక్ సైన్యం వద్ద ఉన్న   కీలకమైన  థండర్, .జే10 ఫైటర్ జెట్లు,హెచ్ క్యూ9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు, పీఎల్ 15 క్షిపణులు చైనా అందించినవే. భారత ఆర్మీ ఉన్నతాధికారుల అంచనా ప్రకారం పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో దాదాపు 81 శాతం చైనా పరికరాలపైనే ఆధారపడి ఉంది. 

ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా తన ఉపగ్రహాల ద్వారా భారత సైనిక కదలికలకు సంబంధించిన 'లైవ్' సమాచారాన్ని పాక్‌కు అందించిందని కూడా రక్షణ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇటీవల కాలంలో టర్కీ కూడా బయేరక్తార్,   డ్రోన్లు,  యుద్ధనౌకలను పాకిస్తాన్‌కు సరఫరా చేస్తూ కీలక రక్షణ భాస్వామిగా మారింది.  

ఇక విషయానికి వస్తే.. ఈ ఆకస్మిక విమానాల కదలికలకు ఆగస్టు 7న మక్కాలో జరిగిన ముక్కోణపు రక్షణ ఒప్పందంతో ప్రత్యక్ష సంబంధం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా ప్రతినిధులు సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం, భాగస్వామ్య దేశాలలో ఏ ఒక్క దానిపై దాడి జరిగినా దానిని ముగ్గురిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ఒప్పందం కుదిరిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ స్థాయిలో ఆయుధ సమీకరణ జరగడం గమనార్హం. అంతర్జాతీయంగా సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో బ్రిక్స్ సమ్మిట్, బిష్కెక్‌లోఎస్సీవో  సమ్మిట్ వంటి కీలక దౌత్య సమావేశాలు జరగనున్న నేపథ్యంలో..  ఈ సైనిక ప్రదర్శన దక్షిణ ఆసియా భద్రతా వాతావరణంలో వ్యూహాత్మక ఒత్తిడిని పెంచే చర్యగా కనిపిస్తోంది.  ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం,  విదేశాంగ మంత్రిత్వ శాఖ  దృష్టి సారించాయి. మక్కా ఒప్పందం వల్ల భారతదేశ జాతీయ భద్రతపై పడే ప్రభావాలను సమగ్రంగా సమీక్షిస్తున్నామని, దేశ రక్షణ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

ప్రతికూల దేశాలు సరిహద్దుల్లో డ్రోన్లు, ఆధునిక ఆయుధ సామగ్రిని మోహరిస్తున్న వేళ, భారతదేశం కూడా తన స్వదేశీ రక్షణ ఉత్పత్తులను వేగవంతం చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రముఖ రక్షణ రంగ సంస్థలతో కాంట్రాక్టులు కుదుర్చుకుని, అధునాతన డ్రోన్ మరియు కౌంటర్-డ్రోన్ వ్యవస్థలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించేందుకు చర్యలు చేపట్టింది.రక్షణ రంగానికి చెందిన విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ త్రైపాక్షిక మరియు ద్విపాక్షిక చర్యలు పాకిస్తాన్ రక్షణ బలహీనతను కూడా బయటపెడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత తీవ్రంగా నష్టపోయిన తన సైనిక సామర్థ్యాన్ని స్వయంగా పునర్నిర్మించుకోలేక, పాకిస్తాన్ బాహ్య శక్తులపై పూర్తిగా ఆధారపడుతోందనడానికి ఈ రహస్య ఆయుధ రవాణా ఆపరేషన్ నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, చైనా, టర్కీ సాంకేతిక పరిజ్ఞానం పాకిస్తాన్ సరిహద్దులకు చేరుకోవడం పట్ల భారత వైమానిక, భూతల దళాలు అత్యున్నత స్థాయి అప్రమత్తతను ప్రకటిస్తూ సరిహద్దుల వద్ద నిఘాను మరింత పెంచాయి.  

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.      

Pakistan China Turkey military agreement, Mecca defense agreement, Nur Khan Air Base, Operation Sindhur, Indian security forces, TeluguOne