పద్మశ్రీ ఏవీఎస్ రాజు ఇక లేరు: దార్శనిక పారిశ్రామికవేత్త అని కొనియాడిన చంద్రబాబు.!
Published on: Wed Oct 14, 2026 12:29PM
నిర్మాణ రంగంలో విశేషమైన సేవలందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు (ఏవీఎస్ రాజు) ఇక లేరు. కొంతకాలంగా వయోభారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో తీసుకుంటున్న ఆయన మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 89 ఏళ్లు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో జన్మించిన ఏవీఎస్ రాజు, తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అసాధారణ విజయాలను సాధించారు. సాధారణ స్థాయి నుంచి ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ప్రత్యేకించి, 1990వ దశకంలో ఏవీఎస్ రాజు హైదరాబాద్లో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థను క్రమక్రమంగా అభివృద్ధి చేస్తూ దేశంలోని అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు.
దేశవ్యాప్తంగా అనేక భారీ ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, సాగునీటి పనుల నిర్మాణంలో ఎన్సీసీ అగ్రగామిగా నిలవడానికి ఏవీఎస్ రాజు అందించిన దార్శనిక నాయకత్వమే కారణం. వ్యాపార రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2010లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
ఏవీఎస్ రాజు మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్సీసీ సంస్థను స్థాపించి, దానిని ఉన్నత శిఖరాలకు చేర్చిన దార్శనిక పారిశ్రామికవేత్తగా ఏవీఎస్ రాజును చంద్రబాబు ప్రస్తుతించారు. నిబద్ధత, నిజాయతీతో దేశ నిర్మాణానికి, అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, స్ఫూర్తిమంతమని పేర్కొన్నారు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా ఎన్సీసీ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో పేదలకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
అలాగే మంత్రి నారా లోకేశ్ కూడా ఏవీఎస్ రాజు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంలో ఎన్సీసీ సంస్థకు గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో రాజు గారి కృషి ఎనలేనిదన్నారు. ఏవీఎస్ రాజు మంచి పద్య రచయిత అని పేర్కొన్న లోకేష్ పద్య రచయితగా ఆయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారని గుర్తు చేసుకున్నారు.
[Padmasri AVS Raju Nomore, Nagarjuna Construction Company, NCC Group Founder, Padma Shri AVS Raju, Telugu One]


