ఆస్కార్ క్లైన్ మెడల్ అందుకున్న తొలి ఇండియన్ అశోక్ సేన్.. ఇండియాలోనే పరిశోధనలు.!
Published on: Mon Oct 26, 2026 11:24AM

సైంటిస్టుగా అంతర్జాతీయ గుర్తింపు.. సమాజిక బాధ్యతలో వెన్నుచూపని ధీరత్వం.!
భౌతిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ క్లైన్ మెడల్ అందుకున్న తొలి ఇండియన్ సైంటిస్ట్ అశోక్ సేన్ . స్ట్రింగ్ థియరీ, బ్లాక్‌హోల్ ఎంట్రోపీ, స్ట్రింగ్ ఫీల్డ్ థియరీ వంటి రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలకు గాను 2026 సంవత్సరానికి ఆయనకీ పురస్కారాన్ని స్టాక్‌హోమ్ విశ్వవిద్యాలయం, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని నోబెల్ కమిటీ ఫర్ ఫిజిక్స్ సంయుక్తంగా ప్రదానం చేశాయి. అశోక్ సేన్ పరిశోధనలు ఆధునిక భౌతిక శాస్త్రంపై గణనీయమైన ప్రభావం చూపాయి.
అపారమైన మేధా సంపత్తి, బోలెడు అవకాశాలూ ఉన్న ఆయన కోరుకుంటే అమెరికాలోనే స్థిరపడి ఈ పరిశోధనలు సాగించవచ్చు. కానీ ఆయన దేశంపట్ల ప్రేమ, గౌరవంతో ఇండియాలోనే తన పరిశోధనలు సాగించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదివిన అశోక్ సేన్, ఐఐటీ కాన్పూర్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి అమెరికాలో పీహెచ్డీ చేశారు. అక్కడ పరిశోధన అనుభవాన్ని సంపాదించిన ఆయన ఇండియాకు తిరిగి వచ్చి, ప్రయాగ్‌రాజ్‌లోని హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చాలా కాలం పాటు పని చేశారు. ఇప్పుడు బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్‌లో ఛైర్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు.

అమెరికాలోనే స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ భారత్‌లో పరిశోధనలను కొనసాగించడానికి దేశ భక్తితో పాటు, ప్రపంచ స్థాయి పరిశోధనలు ఇక్కడా సాధ్యమేనని నిరూపించాలన్న లక్ష్యం, సంకల్పం ఉంది. ఆయన పరిశోధనలు, మేధా సంపత్తికి గుర్తింపుగా ఆయనను 2001లో పద్మశ్రీ, 2103లో పద్మభూషణ పురస్కారాలు వరించాయి. 2014లో అశోక్ సేన్ ను డిరాక్ మెడల్ వరించింది. అంతే కాదు ఆయనకు తన పరిశోధనలకు గాను గతంలో 3 మిలియన్ డాలర్ల భారీ బహుమతి లభించింది.
అశోక్ సేన్ కేవలం శాస్త్రవేత్తగా సమాజానికీ, మానవ పురోగతికి అవసమైన పరిశోధనలు చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక బాధ్యత కూడా పరిపూర్ణంగా పోషించారు. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడానికి ఇసుమంతైనా వెనుకాడని వ్యక్తిత్వం అశోక్ సేన్ ది. 2015లో దేశంలో అసహనం పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు శాస్త్రవేత్తలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఆయన భాగస్వామి.
గోమాంసం తిన్నారనే అనుమానంతో మొహమ్మద్ అఖ్లాక్ హత్య ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో వ్యక్తులపై ఆహారపు అలవాట్ల పేరుతో హింసకు పాల్పడటాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఇలా సమాజంలో చోటుచేసుకునే అన్యాయాలపై గళమెత్తడానికి అశోక్ సేన్ ఎన్నడూ వెనుకాడలేదు. శాస్త్రీయ ఆలోచన, హేతుబద్ధత, మానవ విలువలు వంటి వాటిపై అశోక్ సేన్ కచ్చితంగా వ్యవహరించారు.
ఇక ఆయనకు ప్రతిష్ఘాత్మక ఆస్కార్ క్లైన్ మెడల్ దక్కడానికి కారణమైన స్ట్రింగ్ థియరీ విషయానికి వస్తే.. విశ్వంలోని ప్రాథమిక కణాలు, బలాలు, గురుత్వాకర్షణ వంటి అంశాలను ఒక విస్తృత సిద్ధాంత చట్రంలో అర్థం చేసుకోవడానికి ఈ ధియదీ దోహదం చేస్తుంది. ఈ రంగంలో అశోక్ సేన్ చేసిన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆయన కృషికి లభించిన ఆస్కార్ క్లైన్ మెడల్ భారత శాస్త్ర పరిశోధనలకు కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
[Oskar Klein Medal To Indian Scientist, Ashoke Sen, First Indian, String, Theory, Telugu One]


