అవయవ దానం గురించి ఈ అసలు నిజాలు తెలుసా.!
Published on: Mon Oct 5, 2026 10:44AM
అవయవ దానం గురించి ఈ అసలు నిజాలు తెలుసా.!

శరీరంలో ఏదైనా అవయవం పాడైపోయి ఇక అది పనిచేయదని వైద్యులు నిర్థారించినప్పుడు.. ఆ శరీరానికి తిరిగి కొత్త ఊపిరి పోయే మార్గం.. ఆ పాత అవయవాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అవయవాన్ని ఏర్పాటు చేయడం. దీన్నే అవయవ మార్పిడి అని అంటారు. అవయవ మార్పిడి అనేది అవయవ దానం వల్లే సాధ్యం అవుతుంది. ఎవరైనా అకస్మాత్తుగా మరణించినా, బ్రెయిన్ డెడ్ అయినా వారి శరీరంలో అవయవాలు సేకరించి ఇతరులకు ప్రాణం పోయవచ్చు. నేటికాలంలో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్న కారణంగా చాలామంది బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తుల శరీరంలో అవయవాలను సేకరించి అవయవ మార్పిడి చేయవచ్చు. ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీన ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచం ఇంత అభివృద్ది చెందినా.. ఇంకా చాలామంది ప్రజలలో అవయవ దానం గురించి చాలా అపోహలు ఉన్నాయి. అవయవ దానం గురించి చాలామందిలో ఉన్న అపోహలు, నిజాలు ఏంటో తెలుసుకుంటే..
వయసు పైబడిన వారు అవయవ దానం చేయకూడదా?
కేవలం వయస్సు పెరిగినంత మాత్రాన ఏ వ్యక్తి అవయవ దానానికి అనర్హుడు అని చెప్పడం సరికాదని అంటున్నారు వైద్యులు. వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి , అవయవం నాణ్యత ఆధారంగా, ఏ అవయవాలు మార్పిడికి అర్హమైనవో వైద్య నిపుణులు నిర్ణయిస్తాట. కాబట్టి వయసు పెరిగినా సరే.. ఆరోగ్యం చక్కగా ఉండి, అవయవ పనితీరు మెరుగ్గా ఉంటే.. అవయవ దానం చేయవచ్చు.
మధుమేహం లేదా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవారు అవయవ దానం చేయకూడదా?
మధుమేహం లేదా కొన్ని ఇతర వ్యాధులు ఉన్నంత మాత్రాన, అన్ని రకాల అవయవ దానాలకు పూర్తి నిషేధం విధించబడదు. ఏ అవయవాలు లేదా కణజాలాలు ఉపయోగించడానికి అర్హమైనవో అనే దానిపై వైద్య బృందం తుది నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మధుమేహం లేదా ఏదైనా ఇతర వ్యాధులు ఉన్నవారు అవయవ దానం చేయకూడదు అనేది నిజం కాదు.
అవయవ దానం తర్వాత శరీరాన్ని దహనం చేయడానికి పనికిరాదా?
అవయవాలు , కణజాలాలను వైద్యపరంగా తొలగించి, మృతదేహాన్ని భద్రంగా కుటుంబానికి తిరిగి అప్పగిస్తారు. అవయవ దానం అంత్యక్రియల విధానాలను తొలగించదు. ఏ అవయవాన్ని సేకరించాలని అనుకున్నారో.. దాన్ని మాత్రమే సేకరించి, శరీరాన్ని తిరిగి కుటుంబాలకు అప్పగిస్తారు. కాబట్టి అంత్యక్రియల గురించి ఎలాంటి చింత లేకుండా అవయవాలు దానం చేయవచ్చు.
అవయవ దానానికి అంగీకరించాక.. కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉండదా?
భారతదేశంలో ఒకరు అవయవ దానానికి ముందే అప్పీల్ చేసుకున్నప్పటికీ మరణానంతరం కుటుంబం లేదా చట్టబద్ధమైన వారసుల అనుమతి చాలా కీలకం. అందువల్ల అవయవ దానం చేయాలని అనుకునే వారు తమ కోరికలను కుటుంబంతో ముందుగానే చర్చించడం ముఖ్యం.
అవయవ దానం అనేది కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి కొత్త ఆశను, శరీరానికి కొత్త ఊపిరిని ఇచ్చే ఒక మార్గం కూడా. అందువల్ల, పుకార్లను నమ్మకుండా, ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడం, అవయవ దానం గురించి కుటుంబంతో బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.


