ఒరాకిల్ లో లేఆఫ్ లు.. టెక్ ప్రపంచంలో ప్రకంపనలు.!
Published on: Wed Sep 16, 2026 9:46AM

గ్లోబల్ టెక్ దిగ్గజాలలో ఒకటైన ఒరాకిల్ కంపెనీ చేపట్టిన లేఆఫ్స్ ప్రక్రియ టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంతో నమ్మకంతో సంస్థ కోసం ఏళ్ల తరబడి శ్రమించిన ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం ఊహించని షాక్ తగిలించింది. కార్పొరేట్ వర్గాల్లో ఈ లేఆఫ్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారగా, దీనివల్ల ప్రభావితమైన ఉద్యోగులు పడుతున్న మానసిక వేదన తాలూకు ఆవేదనా భరిత గాధలు సోషల్ మీడియా వేదికగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరిగ్గా వివాహానికి పదకొండు రోజుల ముందు ఉద్యోగం కోల్పోయిన ఓ యువ టెక్కీ ఉదంతం అందరినీ కలచివేస్తోంది.
ఈ ఉదంతం కార్పొరేట్ రంగంలోని దారుణ వాస్తవాలను కళ్లకు కడుతోంది. నాలుగున్నరేళ్లుగా ఒకే కంపెనీలో సేవలు అందిస్తూ, కెరీర్‌లో ముందుకు సాగుదామని భావిస్తున్న తరుణంలో సదరు ఉద్యోగికి కంపెనీ ఉద్వాసన పలికింది. అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న సంస్థాగత మార్పుల నిర్ణయం పేరుతో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అకౌంట్లు, సిస్టమ్ యాక్సెస్‌లను తొలగించడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి ఏర్పాట్లతో బిజీగా ఉండాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఉపాధి కోల్పోవడంతో సదరు ఉద్యోగి దిగ్భ్రాంతికి గురయ్యారు.

మరోవైపు.. ఇదే ఒరాకిల్ సంస్థలో దాదాపు పుష్కరకాలంపాటు పనిచేసిన మరొక సీనియర్ ఉద్యోగి ఉదంతం కూడా నెట్టింట వైరల్‌గా మారింది. తన భర్త ఉద్యోగం కోల్పోయిన వైనాన్ని వివరిస్తూ ఆయన భార్య సామాజిక మాధ్యమాలలో పంచుకున్న ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు, వ్యక్తిగత జీవితాన్ని సైతం పణంగా పెట్టి తన భర్త కంపెనీ అభివృద్ధి కోసం పడిన కష్టాన్ని ఆమె కళ్లకు కట్టినట్లు వివరించారు. భార్య ఆసుపత్రిలో శస్త్రచికిత్స పొందుతున్న సమయంలోనూ, విదేశీ పర్యటనల్లోనూ, హోలీ, దీపావళి వంటి పండుగ దినాల్లోనూ విరామం లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా బాధ్యతలు నిర్వర్తించినట్లు ఆమె గుర్తుచేశారు.
అయితే.. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనూ సంస్థ కోసం రక్తమోడ్చి పని చేసినప్పటికీ, చివరికి ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, రోజూవారీ పనితీరును లెక్కచేయకుండా కేవలం కార్పొరేట్ నిర్ణయాల ద్వారా క్షణాల వ్యవధిలో ఉద్యోగాలు తొలగించడం అత్యంత దారుణమని నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ఐటీ రంగంలోని ఒడుదొడుకుల కారణంగా బడా కార్పొరేట్ సంస్థలు వ్యయ నియంత్రణ పేరిట ఉద్యోగుల తొలగింపులకు పాల్పడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాబోయే రోజుల్లో టెక్ దిగ్గజాలు మరిన్ని సంస్థాగత మార్పులు చేపట్టే అవకాశాలు ఉండటంతో సాధారణ ఉద్యోగుల్లో ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, ఎంతకాలం సేవలు అందించినప్పటికీ కార్పొరేట్ రంగంలో ఉద్యోగ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారుతుండటం ప్రస్తుత పరిస్థితుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.
[Oracle layoffs, Oracle techie job lost before wedding, Oracle employees layoff news, IT industry job cuts 2026, corporate layoffs, Telugu One]


