TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒంగోలుకు 150 వసంతాలు: కష్టాల నుంచి మహానగరంగా...ప్రకాశం చారిత్రక ప్రస్థానం ఇదే.!

Published on: Tue Sep 29, 2026 2:30PM

ఒంగోలు నగరపాలక సంస్థ... నేడు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రకాశం జిల్లాలో మహానగరంగా విరాజిల్లుతోంది. ఒకనాడు మట్టి రోడ్లు, అరకొర వసతులు, గుక్కెడు తాగునీటి కోసం పడిన ఇబ్బట్లతో చిన్నపాటి మున్సిపాలిటీగా మొదలైన ఈ ప్రస్థానం... నేడు శతాబ్దిన్నర (150 వసంతాలు) కాలం పూర్తి చేసుకుని నవశకంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో ఒంగోలు సాధించిన ప్రగతి, ఎదుర్కొన్న సవాళ్లు, మారుతున్న జీవన ప్రమామాలు నగర ప్రజల్లో ఎంతో గర్వాన్ని, ఉద్వేగాన్ని నింపుతున్నాయి.ఒకప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేదో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. పదేళ్ల క్రితం కరెంట్ లేని రోజుల్లో జనరేటర్ల సహాయంతో బల్బు ఎలా వెలుగుతుందో చూసేందుకు జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. తాగునీటి కోసం రంగారాయుడు చెరువు వద్దకు వెళ్లి, బిందెలతో నీరు తెచ్చి ఇంటంటా అమ్ముకుని బతికిన కుటుంబాలు ఎన్నో. నాటి కష్టాలను తలుచుకుంటే కంటతడి పెట్టించే విషయమే అయినా, కాలక్రమేణా గుండ్లకమ్మ పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ కుళాయి నీరు అందడం ప్రారంభమైంది. 

నేడు చిన్నపాటి గ్రేడ్-3 మున్సిపాలిటీ నుంచి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న నగరపాలక సంస్థగా ఒంగోలు రూపాంతరం చెందింది.ఎటు చూసినా విశాలమైన రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అద్భుతమైన పురోగతితో ఈ నగరం ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకూ ప్రధాన వాణిజ్య కేంద్రంగా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒంగోలు గిత్తల ఘనత, సారవంతమైన నల్లరేగడ భూములు, వరి, పత్తి, మిరప, పొగాకు వంటి పంటల దిగుబడి ఈ ప్రాంతపు నేల గొప్పదనాన్ని చాటుతున్నాయి. బ్రెజిల్ దేశపు ఆర్థిక వ్యవస్థే ఒంగోలు జాతి ఆబోతులపై ఆధారపడి ఉందంటే మన ప్రాంతం ఎంతటి ఖ్యాతిని గడించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, శతాబ్దిన్నర ఉత్సవాల వేళ కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలపై కూడా దృష్టి పడుతోంది. నగర విస్తీర్ణం పెరిగిన కొద్దీ ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ ఇబ్బందులు, వర్షాకాలంలో రోడ్లు జలమయం కావడం వంటి సమస్యలు ఇప్పటికీ ప్రజలను వేధిస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని నగరవాసులు కోరుతున్నారు.

ఇదే సమయంలో నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు అభినందనీయం. తడి, పొడి చెత్తను వేరుచేసి ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేస్తూ 'గ్రీన్ గోల్డ్' పేరుతో బ్రాండింగ్ చేయడం, ఒకే రోజు వేలాది ఇళ్లలో చెత్తను వేరుచేసి 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్' సాధించడం ఒంగోలు ప్రజల సమిష్టి ఐక్యతకు నిదర్శనం. మాది పక్కనే చిన్న గ్రామమైనా మాది ఒంగోలు అని గర్వంగా చెప్పుకునే ప్రతి గుండెలోనూ ఈ చారిత్రక క్షణాలు భావోద్వేగాన్ని కలిగిస్తున్నాయి. రామాయపట్నం పోర్టు రాకతో భవిష్యత్తులో మరింత ఆర్థిక ప్రగతి సాధించబోతున్న ఈ గడ్డపై... గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, మౌలిక వసతుల లేమిని అధిగమిస్తూ, మరింత సుందరమైన నగరంగా ఒంగోలును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తున్నారు.

 

 

 

[ Ongole 150 Years, Ongole Municipal Corporation, Ongole City, Prakasam District, Ongole Development, 150th Anniversary, Ongole History, Urban Development, Drinking Water, Gundlakamma Pipeline, Ongole Bulls, Ongole Cattle, Black Soil, Agriculture, Traffic Problems, Parking Issues ]