TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ ఒక్క పోషకం లోపిస్తే నిద్ర, గుండె ఆరోగ్యం, కండరాల బలహీనత.. ఇలా ఎన్ని సమస్యలో తెలుసా.!

Published on: Mon Nov 23, 2026 10:26AM

ఈ ఒక్క పోషకం లోపిస్తే నిద్ర, గుండె ఆరోగ్యం, కండరాల బలహీనత.. ఇలా ఎన్ని సమస్యలో తెలుసా?

ఉదయం లేచినప్పటి నుంచీ ఏదో తెలియని అలసట, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అప్పుడప్పుడు కండరాలు పట్టేయడం లేదా బలహీనంగా అనిపించడం.. వీటిని మనం చాలామంది రోజువారీ ఒత్తిడి లేదా పని భారం వల్ల వచ్చిన సాధారణ విషయాలుగా కొట్టిపారేస్తాం. కానీ వీటన్నింటి వెనుక మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం లోపం ఉండొచ్చు. అదే మెగ్నీషియం. మన ఆరోగ్యానికి విటమిన్లు ఎంత అవసరమో, ఖనిజాలు కూడా అంతే అవసరం. వాటిలో మెగ్నీషియం పాత్ర ఎంతో కీలకమైనది. శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలు, గుండె సరిగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది.

మన శరీరంలో శక్తి తయారవ్వాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలన్నా, రక్తపోటు సమతుల్యంగా ఉండాలన్నా మెగ్నీషియం ఎంతో అవసరం. సాధారణంగా పెద్దవారికి రోజుకు సుమారు 310 నుంచి 420 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం అవసరం అవుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇంత తక్కువ మోతాదులో అవసరమయ్యే ఈ పోషకం శరీరానికి సరిపడా అందకపోతే, చాలామందిలో మెల్లమెల్లగా లోపం తలెత్తుతుంది.

మెగ్నీషియం లోపం ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి. కండరాలు బిగుసుకుపోవడం, పట్టేయడం, కొందరిలో వణుకు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శరీరంలో నీరసం, బలహీనత, అలసట ఎక్కువగా అనిపించడం కూడా దీని వల్ల జరగవచ్చు. కండరాలు సాధారణంగా పనిచేయడానికి, వాటికి విశ్రాంతి కలగడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. అందుకే దీని లోపం ఉన్నప్పుడు కండరాలకు సంబంధించిన సమస్యలు త్వరగా బయటపడతాయి.

నరాల పనితీరు సక్రమంగా సాగడానికి, శరీరంలో శక్తి ఉత్పత్తి జరగడానికి కూడా మెగ్నీషియం అవసరం. ఇది తగ్గిపోయినప్పుడు కొందరిలో మనసు ప్రశాంతంగా లేకపోవడం, చిరాకు, చికాకు కలగడం వంటివి కనిపిస్తాయి. దీని ప్రభావం నిద్ర మీద కూడా పడుతుంది. రాత్రి పూట సుఖంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో అంతరాయాలు కలగడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇది కూడా చదవండి  బూడిద గుమ్మడి రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.!

గుండె ఆరోగ్యంపై మెగ్నీషియం లోపం తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఉండటానికి, రక్తపోటు అదుపులో ఉండటానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉన్నవారిలో గుండె స్పందనల్లో తేడాలు రావడం, రక్తపోటుపై ప్రభావం పడటం, అలాగే శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు.

మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి..

రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఇంట్లో దొరికే అనేక ఆహార పదార్థాల్లో మెగ్నీషియం బాగానే ఉంటుంది. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం అందుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ లోపం చాలా ఎక్కువగా ఉంటే, వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు.

మొత్తానికి చిన్నదిగా కనిపించే ఈ ఖనిజం మన శరీరంలోని ఎన్నో ముఖ్యమైన పనులను నియంత్రిస్తుంది. అలసట, కండరాల నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనిపిస్తే లేదా దీర్ఘకాలంగా వేధిస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

                                                                                                                                               *రూపశ్రీ.

మీకు నచ్చవచ్చు  మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్టేనట..!

                                కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!