TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాత కరెన్సీ నోట్ల పేరుతో సైబర్ మోసం.. ఇద్దరి అరెస్ట్.!

Published on: Sun Oct 11, 2026 4:08PM

పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లకు మ్యూల్ బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సమకూర్చుతున్న ఇద్దరు  కేటుగాళ్లు ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కమీషన్ల ఆశతో విద్యార్థులు, డెలివరీ బాయ్స్‌తో పాటు ఇతర వ్యక్తుల నుంచి 70కి పైగా బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులను సేకరించి సైబర్ నేరగాళ్లకు అందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా సుమారు 450 కేసులు నమోదైనట్లు, రూ.60-70 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత ఒక్క రూపాయి నోటుకు బదులుగా రూ.45 లక్షలు ఇస్తామని ఫేస్‌బుక్ ద్వారా నమ్మించి ఓ బాధితుడి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.7,93,351 కాజేశారు. 

ఈ ఘటనపై బాధితుడు సెప్టెంబర్ 25న ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం ఆధారంగా అక్టోబర్ 8న రామాంతపూర్, అంబర్‌పేట్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన గుమ్మ రమేష్ (39), రామాంతపూర్‌కు చెందిన ముదాలె అనిల్ (19) ఉన్నారు. రమేష్ గతంలో బీదర్‌లో నివసించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని రామాంతపూర్‌కు వచ్చి, అద్దె కారుతో రాపిడో, ఉబర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లతో పరిచయాలు ఏర్పడటంతో వారి కోసం బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సేకరించడం ప్రారంభించాడు. రామాంతపూర్, పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు, డెలివరీ బాయ్స్, ఇతర వ్యక్తులకు కమీషన్లు ఇస్తామని ఆశచూపి వారి నుంచి 60-70 మంది వరకు బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. 

ఖాతాలకు సంబంధించిన పాస్‌బుక్‌లు, ఏటీఎం/డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలతో పాటు సిమ్ కార్డులను హర్యానాలోని వ్యక్తులకు కొరియర్ ద్వారా పంపించేవాడని వెల్లడించారు.మరో నిందితుడు అనిల్.. రమేష్ ఇచ్చిన కమీషన్ ఆశతో వేర్వేరు బ్యాంకుల్లో మూడు సేవింగ్స్ ఖాతాలు తెరిచి, వాటికి సంబంధించిన వివరాలను అతనికి అందించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఖాతాలు, సిమ్ కార్డులను ఉపయోగించి ప్రధాన సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసినట్లు అనుమానిస్తున్నారు.తమకు వచ్చే ఆదాయం వ్యక్తిగత ఖర్చులు, ఆర్థిక అవసరాలకు సరిపోకపో వడంతో అధిక కమీషన్ల కోసం సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు, సిమ్ కార్డులు అందించినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. తాము సమకూర్చిన ఖాతాలు, సిమ్ కార్డులు సైబర్ నేరాలకు ఉపయోగపడతాయని తెలిసినా కమీషన్ల కోసం సహకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66C, 66Dతో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్లు 318(4), 319(2), 336(3), 340(2) కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

 

 

[ Old Currency Notes Scam, Cyber Crime Hyderabad, Hyderabad Cyber Crime Police, Cyber Fraud, Mule Bank Accounts, SIM Card Fraud, Fake Currency Note Offers, Online Scam, Facebook Fraud, Cyber Criminals Arrested, Gumm Ramesh, Mudale Anil, ₹7.93 Lakh Fraud, ₹70 Crore Transactions, 450 Cyber Crime Cases, Bank Account Scam, Telangana Cyber Crime, IT Act 66C, IT Act 66D, BNS Sections 318(4), Cyber Fraud Investigation ]