నాసిరకం రోడ్లు: ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్లే బాధ్యులు.. ఒడిశా సర్కార్ నూతన నిబంధనలు.!
Published on: Sat Sep 26, 2026 2:16PM

రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రయాణికులు, పాదచారుల భద్రతకు ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. తప్పుడు డిజైన్లు, నాసిరకం నిర్మాణాలు, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పాదచారులు మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా, ఆ పరిణామాలకు పూర్తి బాధ్యత ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలదేనంటూ నిబంధనలను రూపొందించింది. ఈ కొత్త నిబంధనల ముసాయిదాను ఒడిశా సర్కార్ గురువారం (సెప్టెంబర్ 24) విడుదల చేసింది. రోడ్ల నాణ్యత లోపం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న వైనాన్ని అరికట్టే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ ప్రతిపాదిత నిబంధనల ప్రకారం మోటర్ వాహనాల చట్టంలోని సెక్షన్ 198ఏ కింద ఈ తరహా దుర్ఘటనల్లో బాధ్యులైన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం విచారణతో సరిపెట్టకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్మాణ సంస్థలను ప్రస్తుత ఒప్పందాల నుంచి పూర్తిగా తొలగించడంతో పాటు వాటిని బ్లాక్ లిస్టులో చేర్చాలని యోచిస్తున్నది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లకు రావాల్సిన తదుపరి చెల్లింపులను నిలిపివేయాలని ప్రతిపాదిత నిబంధనల్లో పేర్కొంది. రోడ్డు నిర్మాణ రంగంలో పారదర్శకతను తీసుకురావడానికి , జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ చర్యలు దోహదపడతాయని చెబుతున్నది.

ఈ విధానంలో భాగంగా ప్రతి రోడ్డు ప్రాజెక్ట్ పూర్తికాగానే తుది అనుమతి లేదా చివరి ఆర్థిక చెల్లింపు జరిగే ముందు ప్రధాన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వ్యక్తిగత చట్టపరమైన బాధ్యతను అంగీకరిస్తూ భద్రత సమ్మతి ప్రకటనపై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది. రోడ్డు భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నివారించేందుకు ఈ ముసాయిదా నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు మరియు పాదచారుల మరణాలు పెరుగుతున్న తరుణంలో, ఒడిశా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ముసాయిదా నిబంధనలు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక రోడ్‌మ్యాప్‌గా నిలుస్తాయని పరిశీలకులు అంటున్నారు.
[Odisha Government, Substandard Roads, Pedestrian Safety, Road Accidents, Contractor Liability, Motor Vehicles Act. Telugu One]


