తలసేమియా వ్యాధిగ్రస్తుల ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు: బెజవాడలో బ్లడ్ బ్యాంక్.!
Published on: Fri Oct 16, 2026 3:10PM

సమాజ సేవ లక్ష్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిరంతరం వినూత్న కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. లాభాపేక్ష లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ, తాజాగా తలసేమియా (రక్తహీనత)తో బాధపడుతున్న చిన్నారుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తలసేమియా బాధితులకు అండగా నిలిచేందుకు నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో విజయవాడలో బ్లడ్ బ్యాంక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన కేంద్రం ద్వారా బాధితులకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందనున్నాయి.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా భువనేశ్వరి సమాజ సేవలో ముందుంటున్న విషయం తెలిసిందే. ఆమె నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నిరుపేదలకు భరోసా కల్పించే దిశగా ట్రస్ట్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే తలసేమియా వ్యాధి బారిన పడిన చిన్నారులకు నిరంతరం అవసరమయ్యే రక్త మార్పిడి సేవలను సులభతరం చేసేందుకు విజయవాడ కేంద్రంగా ఈ నూతన బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.
తలసేమియా అనేది జన్యుపరమైన సమస్యల కారణంగా వంశపారంపర్యంగా వచ్చే తీవ్రమైన రక్తసంబంధిత వ్యాధి. ఈ వ్యాధితో బాధపడే చిన్నారులకు క్రమం తప్పకుండా రక్తాన్ని మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే నిరుపేద కుటుంబాలకు ప్రతిసారీ రక్తాన్ని సమకూర్చుకోవడం, వైద్య ఖర్చులు భరించడం ఆర్థికంగా భారం ఈ దుస్థితిని నివారించడానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ గతంలోనే హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ప్రత్యేక తలసేమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు, రక్తమార్పిడి, మందులను అందజేస్తోంది. ఇప్పుడు ఆ సేవలను మరింత విస్తరించేలా విజయవాడలోనూ సేవలు అందించడం ప్రారంభించింది.

ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా తలసేమియా రోగులకు ఎటువంటి అంతరాయం లేకుండా సురక్షితమైన రక్తం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రక్త మార్పిడి ప్రక్రియతో పాటు అవసరమైన మందులను కూడా ట్రస్ట్ ద్వారా ఉచిత అందజేయనున్నారు. వ్యాధిగ్రస్తులైన కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఈ వైద్య శిబిరాలు, కేంద్రాలు పనిచేస్తున్నాయి. నిరంతరం రక్తం అవసరమయ్యే ఈ వ్యాధి బాధితులకు ఈ సదుపాయం ఒక పెద్ద సాంత్వన చేకూరుస్తుందనడంలో సందేహం లేదు.
[NTR Trust Vijayawada Blood Bank, Thalassemia Patients Care, Nara Bhuvaneshwari, NTR Memorial Trust, Vijayawada Medical Services, Telugu One]


