TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

NSE IPO Launch Date Fixed: ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ మరియు పూర్తి వివరాలు ఇవే!

Published on: Sat Sep 12, 2026 9:32AM

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఒక కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తన ఐపీఓ (IPO) ప్రారంభ తేదీలను అధికారికంగా ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో పండగ వాతావరణం నెలకొంది. స్టాక్ మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా సెప్టెంబర్ 17న ఈ భారీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇన్వెస్టర్లు అప్లై చేయడానికి సెప్టెంబర్ 21 వరకు గడువు ఉంటుంది. ఈ ఐపీఓ కోసం కంపెనీ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 1,700 నుండి రూ. 1,785 గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా ఎన్ఎస్ఈ ఏకంగా రూ. 22,561.5 కోట్ల భారీ నిధులను మార్కెట్ నుండి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గరిష్ట ధరల శ్రేణి వద్ద కంపెనీ మొత్తం మార్కెట్ వ్యాల్యుయేషన్ దాదాపు రూ. 4.42 లక్షల కోట్లుగా అంచనా వేయడం దీని పరిమాణాన్ని తెలియజేస్తోంది.

ఈ మొత్తం ఐపీఓ 'బుక్-బిల్ట్' పద్ధతిలో పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) రూపంలో రాబోతోంది. అంటే ఈ ఐపీఓలో ఎన్ఎస్ఈ ఎటువంటి కొత్త షేర్లను జారీ చేయడం లేదు. కాబట్టి దీనిద్వారా వచ్చే రూ. 22,561.5 కోట్ల నిధులన్నీ ప్రస్తుతం కంపెనీలో వాటాలు కలిగి ఉన్న విక్రయదారులకే చెందుతాయి. సంస్థలోని 10 మంది ప్రధాన వాటాదారులు గరిష్టంగా 12.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడానికి ముందుకు వచ్చారు. జూన్ 2026లో దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)లో మొదట 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మాలని భావించినప్పటికీ, తుది ఆఫర్‌లో ఇష్యూ పరిమాణాన్ని 15 శాతం తగ్గించడం గమనార్హం. కాగా, ఈ ఐపీఓ ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) సెప్టెంబర్ 4, 2026న ఆమోద ముద్ర వేసింది. ఈ ఐపీఓ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఓఎఫ్ఎస్ ప్రక్రియను పూర్తి చేసి, ఎన్ఎస్ఈ ఈక్విటీ షేర్లను బీఎస్ఈ (BSE)లో లిస్ట్ చేయడం మాత్రమే.

ఈ ఐపీఓ ద్వారా విక్రయం జరుపుతున్న ప్రధాన సంస్థల్లో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అగ్రస్థానంలో ఉంది. ఎస్బీఐ గరిష్టంగా 1.59 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. అలాగే కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ 1.18 కోట్ల షేర్లను, అరండా ఇన్వెస్ట్‌మెంట్స్ (మారిషస్) 1.12 కోట్ల షేర్లను, MS స్ట్రాటజిక్ (మారిషస్) 1.1 కోట్ల షేర్లను మరియు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ 1.05 కోట్ల షేర్లను విక్రయదారుల జాబితాలో ఉంచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి మరికొన్ని సంస్థలు తమ విక్రయ వాటాల సంఖ్యను కొద్దిగా సవరించుకున్నాయి. ఈ భారీ ప్రజా సమర్పణను ఎటువంటి అంతరాయం లేకుండా నిర్వహించడానికి ఏకంగా 20 మంది ప్రముఖ మర్చంట్ బ్యాంకర్లను నియమించారు. వీరిలో కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మరియు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వంటి దిగ్గజ సంస్థలు బాధ్యతలు నిర్వహిస్తున్నాయి.

పెట్టుబడి పరంగా ఎన్ఎస్ఈ వ్యాపార నమూనాను విశ్లేషిస్తే, ఆర్థిక సంవత్సరం 2026 నాటికి కంపెనీ తన మొత్తం ఆదాయంలో 78.65% కేవలం లావాదేవీల ఛార్జీల (Transaction Charges) నుంచే పొందుతోంది. దీనివల్ల మార్కెట్‌లో ట్రేడింగ్ పరిమాణం తగ్గితే ఎన్ఎస్ఈ ఆదాయంపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎన్ఎస్ఈ తన ఆదాయంలో 46.78% వాటాను టాప్ 10 ట్రేడింగ్ మెంబర్ల నుంచే సాధిస్తుండటం మరొక ముఖ్యమైన అంశం. అయినప్పటికీ, వాల్యుయేషన్ అంశం ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఎస్ఈ (BSE) షేర్లు 49 PE మల్టిపుల్ వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఈ ఐపీఓ షేర్లు 35 PE మల్టిపుల్ వద్ద తక్కువ వాల్యుయేషన్‌లోనే లభిస్తున్నాయి. ఇది ఇన్వెస్టర్లకు మంచి అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.

 

 

 

[NSE IPO, National Stock Exchange IPO, NSE IPO 2026, NSE IPO Date, NSE IPO Price Band, NSE IPO September 2026, SEBI, SBI, BSE, NSE Share Listing]