సమాజ శ్రేయస్సే వ్యాపార పరమార్ధం: రతన్ టాటా బాటలోనే నోయెల్ టాటా.. పేదల వైద్యం కోసం 50 ఆస్పత్రులు.!
Published on: Tue Oct 20, 2026 6:46AM

రతన్ టాటా సేవా వారస్వాన్ని నోయెల్ టాటా ముందుకు తీసుకు వెడుతున్నారు. భారత వ్యాపార సామ్రాజ్యంలోనే కాకుండా ప్రజా సంక్షేమ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన రతన్ టాటా వారస్వన్ని టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా కొనసాగిస్తున్నారు. ఆ దిశగా ఓ చారిత్రాత్మక ఘట్టానికి ఆయన శ్రీకారం చుట్టారు. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆశయాలను, ఆయన వదిలివెళ్లిన సేవా వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా నోయెల్ టాటా దేశంలో సామాన్యులకు, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా దేశ వ్యాప్తంగా 40 నుండి 50 ఆసుపత్రులను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రైవేటు వైద్యం అత్యంత ప్రియమైన ప్రస్తుత పరిస్ధితుల్లో.. నోయెల్ టాటా రూపొందించి అమలు చేయనున్న ఈ ప్రాజెక్ట్ ఇండయన్ హెల్త్ కేర్ సెక్టార్ లో విప్లవాత్మక మార్పునకు బాటలు వేస్తుందనడంలో సందేహం లేదు.
ఈ ప్రతిష్టాత్మక హెల్త్‌కేర్ విస్తరణ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశంలో వైద్య సదుపాయాలు సరిగా లేని ప్రాంతాలు, గ్రామీణ సరిహద్దులు, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం ధనికులకు మాత్రమే పరిమితం కాకూడదని, ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి మెరుగైన చికిత్స అందాలన్న సదాశయంతో నోయెల్ టాటా ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. ఈ ఆసుపత్రుల నిర్మాణం ద్వారా అత్యాధునిక వైద్య పరికరాలు, అర్హత కలిగిన ప్రముఖ వైద్యులు, సకల సౌకర్యాలతో కూడిన అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఇది సమాజంలో అల్పాదాయ వర్గాల కుటుంబాల ఆరోగ్య సంరక్షణలో గేమ్ చేంజర్ గా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా పేదలకు నిరంతరాయంగా, ఎఫెక్టివ్ గా సేవలందించేందుకు నోయెల్ టాటా ఒక వినూత్నమైన ఆర్థిక నమూనాను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం, ఆర్థిక స్థోమత ఉన్న రోగులు చెల్లించే సేవా రుసుముల ద్వారా వచ్చే ఆదాయాన్ని నిరుపేద రోగుల ఉచిత, స్వల్ప రుసుము వైద్యానికి సబ్సిడీగా ఉపయోగిస్తారు. అంటే ఆసుపత్రికి వచ్చే సంపన్నులు పొందే వైద్య సేవల ద్వారా లభించే వచ్చే ఆదాయం.. పేద రోగులకు అందించే ఉచిత చికిత్సలకు నిధులుగా మారతాయి. ఈ సెల్ఫ్ సస్టెయినింగ్ మోడల్ ఫండ్స్ వల్ల ప్రభుత్వ నిధులు, విరాళాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నిరాఘాటంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను నిరంతరాయంగా అందించడానికి వీలవుతుంది.
ముంబైలోని ప్రసిద్ధ టాటా మెమోరియల్ హాస్పిటల్ ఇప్పటికే క్యాన్సర్ బాధితులకు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ స్ఫూర్తితో, అదే తరహా సేవా దృక్పథాన్ని సాధారణ ఆసుపత్రుల విభాగానికి కూడా వర్తింపజేయాలన్నదే టాటా నోయెల్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కొత్తగా నిర్మించే 40 నంచి 50 ఆసుపత్రులలో కేవలం సాధారణ వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా, అత్యవసర వైద్యం, మాతాశిశు సంరక్షణ, ఆపరేషన్లు, రోగనిర్ధారణ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. దీని వల్ల పేదరోగులు వైద్య చికిత్స కోసం నగరాలకు వెళ్లే అవసరం ఉండదు. స్థానికంగానే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది.
రతన్ టాటా తన జీవితకాలంలో వ్యాపార విస్తరణతో పాటు సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆయన మరణం తర్వాత టాటా ట్రస్ట్స్ సారథ్యాన్ని స్వీకరించిన నోయెల్ టాటా, రతన్ టాటా ఆశయాలను కొనసాగించడమే కాకుండా మరింత విస్తరిస్తూ ముందుకు సాగుతున్నారు. . టాటా గ్రూప్ లాభాల్లో అత్యధిక భాగాన్ని ట్రస్ట్స్ ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు. . ఈ క్రమంలో నోయెల్ టాటా తీసుకున్న ఈ తాజా నిర్ణయం నిర్ణయం సమాజ శ్రేయస్సే వ్యాపార పరమార్థం అనే సూత్రానికి అద్దం పడుతోంది.
దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు లేవన్నది కాదనలేని వాస్తవం.అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య ఖర్చులు అసాధారణంగా పెరిగిపోయాయి. సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చికిత్స అన్నది తట్టుకోలేని ఆర్థిక సంక్షోభంగా మారింది. వైద్య ఖర్చుల కారణంగా అనేక కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నపరిస్థితి. ఇటువంటి తరుణంగా టాటా నోయెల్.. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవను ఉచితంగా అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పేదల పాలిట సంజీవని అనడంలో సందేహం లేదు.
ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని వివిధ దశలలో టాటా ట్రస్ట్స్ చేపట్టనుంది. తొలి దశలో అత్యంత వెనుకబడిన జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలో ప్రారంభించనున్నారు. ఆధునిక డిజిటల్ హెల్త్‌కేర్ సాంకేతికతలు, టెలిమెడిసిన్, రోబోటిక్ వైద్య పరికరాలను కూడా ఈ ఆసుపత్రులలో వినియోగించేలా ప్రణాళికలురూపొందించారు. రతన్ టాటా సేవా మార్గంలోని ముందుకు సాగుతూ.. నోయెల్ టాటా తీసుకున్న ఈ నిర్ణయం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందనడంలో సందేహం లేదు.
[Noel Tata Take dorward Ratan Tata Legacy, Tata Trusts Hospitals, Tata Healthcare Initiative, Affordable Healthcare India, Business, Purpose, Society, Wellbeing, Telugu One]


