TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శరీరానికి ఎంతో అవసరమైన ఒమేగా 3 కోసం ఖరీదైన ఫుడ్ అక్కర్లేదు.. చవకగా లభించే ఈ ఫుడ్ చాలు..!

Published on: Tue Aug 25, 2026 6:18PM

ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

అవిసె గింజలు..

అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి.

చియా విత్తనాలు..

శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి.

చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్)..

ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

సోయాబీన్స్..

మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది.

నువ్వులు..

భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి.

పాలకూర మరియు ఆకుకూరలు..

రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి.

ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

                                                                                                                                       *రూపశ్రీ.