ఎంపీ కి కేంద్ర మంత్రి క్షమాపణలు..

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తనను రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, ఫలకంపై తన పేరును ముద్రించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు కాంగ్రెస్ ఎంపీ సింధియా.జీరో అవర్‌ ప్రారంభంలో మాట్లాడిన ఆయన రహదారి ప్రారంభోత్సవానికి తనను పిలవకుండా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అవమానించిందన్నారు.ప్రొటోకాల్‌ ప్రకారం అలాంటి కార్యక్రమాలకు స్థానిక ఎంపీలను పిలవాలని అన్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తాను ప్రివిలేజ్‌ మోషన్‌ పెట్టాలనుకుంటున్నానని చెప్పారు.దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెంటనే స్పందించారు.

 

 

ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరగకూడదని అన్నారు. ఎంపీల పేర్లు కచ్చితంగా ఫలకాలపై ఉండాలని, ప్రారంభోత్సవాలకు వారిని తప్పకుండా ఆహ్వానించాలని అన్నారు. ‘నేను కార్యక్రమానికి హాజరైనందున దీనికి నేనే బాధ్యుడిని. అందరి తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటి మళ్లీ జరగవు’ అని గడ్కరీ అన్నారు.గడ్కరీ క్షమాపణలు చెప్పినప్పటికీ సింధియా.. ఎంపీల హక్కులు, అధికారాలను కాపాడాలని, దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పలుమార్లు ఇదే విధంగా డిమాండ్‌ చేశారు.దీంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ స్పందిస్తూ.. దీనిపై గడ్కరీ క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు.