TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్వర రాగ రస భావ తాళాన్వితం.. ఎంఎస్ సుబ్బులక్ష్మిని తలచుకుని కన్నీటిపర్యంతమైన విత్త మంత్రి.!

Published on: Thu Sep 17, 2026 10:54AM

సంగీత ప్రపంచాన్ని తన మధుర  గాత్రంతో ఏళ్ల తరబడి ఓలలాడించిన దిగ్గజ సంగీత విద్వాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి వేడుకలు   దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ  సందర్భాన్ని పురస్కరించుకుని బెంగళూరులోని   చౌడయ్య మెమోరియల్ హాల్‌లో  సంగీత కార్యక్రమం నిర్వహించారు.  ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అక్కడ ప్రదర్శించిన ఒక  కార్యక్రమాన్ని తిలకిస్తూ  భావోద్వేగానికి లోనయ్యారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి మునుమవరాళ్లు ఎస్. ఐశ్వర్య,  ఎస్. సౌందర్య వేదికపై తమ  అమ్మమ్మ సంగీత పరంపరను కొనసాగిస్తూ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా, ఆ మంత్రముగ్ధులను చేసే గాత్రానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.   అందుకు సంబంధించిన దృశ్యాలు  సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సుబ్బులక్ష్మి సంగీత సాధన, క్రమశిక్షణను  స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భిన్న భాషలు, అనేక రాష్ట్రాలుగా విడిపోయిన దేశంలో ఆధ్యాత్మిక సంప్రదాయాలను, భక్తి భావాలను సంగీతం ఎలా ఒక్కటి చేస్తుందో   సుబ్బులక్ష్మి చూపారని పేర్కొన్నారు.  ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ, ముఖ్యంగా వేల సంఖ్యలో ఉన్న ఆలయాల్లో ఉదయాన్నే మారుమోగే దివ్యమైన ‘వెంకటేశ్వర సుప్రభాతం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గొంతులోనే వినడానికి ప్రజలు ఇష్టపడతారని, ఆ గొంతుతోనే భగవానుడు కూడా మేల్కొంటాడని నిర్మలాసీతారామన్ అన్నారు. 

1916 సెప్టెంబర్ 16న మధురైలో జన్మించిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, తన అద్భుత  గాత్రంతో భారత సంగీతానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.  1966లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ సంగీత విద్వాంసురాలిగా ఎంఎస్ సుబ్బులక్ష్మీ చరిత్ర సృష్టించారు.  తెలుగు సాహిత్యానికి సంబంధించి అన్నమయ్య కీర్తనలు, తమిళ భక్తి రచనలు, మలయాళ గీతాలు అలాగే కన్నడ దాస సంకీర్తనలను సైతం సుబ్బులక్ష్మి ఎంతో సునాయాసంగా, భక్తిభావం ఉట్టిపడేలా ఆలపించగలరని నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.

శ్యామశాస్త్రి కృతులను,  పాలింతు కామాక్షి' లాంటి దివ్యమైన కీర్తనలను గుర్తుచేసుకుంటూ.. మనిషి జీవితంలో ఎలాంటి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆమె పాటలు వింటే క్షణాల్లో దైవిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వారసులుగా వచ్చిన ఆమె మునుమవరాళ్ల ప్రదర్శన చూస్తున్నంతసేపు, ఆ దిగ్గజ గాయని ప్రత్యక్షంగా కళ్లముందు కదలాడుతున్నారన్న భావన కలిగిందని నిర్మలా సీతారామన్ భావోద్వేగానికి గురయ్యారు. సంగీత సాధన వెనుక ఎంతటి కఠోర దీక్ష ఉంటుందో సుబ్బులక్ష్మి జీవితమే నిదర్శనమని కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

[Nirmala Sitharaman, MS Subbulakshmi, Nirmala Sitharaman Emotional, MS Subbulakshmi 110th birth anniversary, Bengaluru, Indian Classical Music]