ఆదాయానికి మించిన ఆస్తుల కేసు: నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ సస్పెన్షన్.!
Published on: Wed Sep 30, 2026 4:08PM

నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ సస్పెండ్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్స్ డైరెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు. ఇదే నిబంధనల ప్రకారం లక్ష్మీ భాస్కర్‌ను సెప్టెంబర్ 22 నుంచే సస్పెండ్ చేస్తూ నిమ్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం కూడా ఆయన్ను అరెస్టయిన తేదీ నుంచే సస్పెన్షన్‌లో ఉంచాలని నిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భాగంగా లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన బినామీల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సోదాల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించిన వివరాలు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆస్తుల వివరాలు, వాటి విలువ, ఎవరి పేర్లపై ఉన్నాయన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ నివేదికలు, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, లక్ష్మీ భాస్కర్ 48 గంటలకు పైగా కస్టడీలో ఉన్న విషయాన్ని పరిశీలించిన అనంతరం నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు.
[NIMS Lakshmi Bhaskar, ACB Raids Hyderabad, Disproportionate Assets, NIMS Superintendent Suspended, Benami Assets, NIMS Corruption Case]


