100 కోట్ల ఆస్తులు: నిమ్స్ డాక్టర్ ఆస్తుల గుట్టు విప్పిన ఏసీబీ..!
Published on: Tue Sep 22, 2026 8:47PM

నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. సర్వీసులో ఉండగా అవినీతి, అక్రమ మార్గాల్లో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణ) కింద హైదరాబాద్‌తో పాటు మూడు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో స్థిర, చర ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

సోదాల్లో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ 4-బెడ్‌రూమ్ ఫ్లాట్, కూకట్‌పల్లిలో రెండు 3-బెడ్‌రూమ్ ఫ్లాట్లు, మణికొండ, పేట్‌బషీరాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఐదు 2-బెడ్‌రూమ్ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే యాదాద్రి, నందిగామ, శామీర్‌పేటలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 800 చదరపు గజాల స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షల నగదు నిల్వలు, పోస్టాఫీసుల్లో రూ.12 లక్షల డిపాజిట్లు, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో రూ.35 లక్షల పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.55 లక్షల పెట్టుబడులు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది.

అలాగే సుమారు 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు, జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా ద్విచక్ర వాహనాలను గుర్తించినట్లు వెల్లడించింది. సుమారు రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు రూ.1.30 కోట్లు వెచ్చించినట్లు పత్రాల ద్వారా గుర్తించారు. పలువురికి చేతి అప్పుల రూపంలో రూ.1.33 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు లభించాయని ఏసీబీ వెల్లడించింది.

ప్రాథమికంగా సోదాల్లో గుర్తించిన ఆస్తుల డాక్యుమెంట్ విలువ రూ.6.13 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. అయితే వాటి బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉండొచ్చని ఏసీబీ పేర్కొంది. అదనపు ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. సోదాలు, దర్యాప్తు పూర్తయిన అనంతరం ఆస్తుల విలువ, ఆదాయానికి మించిన ఆస్తులపై పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.
[ NIMS Doctor, ACB Raids, Nori Lakshmi Bhaskar, Disproportionate Assets, Telangana ACB, NIMS, Hyderabad, Illegal Assets, ACB Case, Corruption Case ]


