TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నైలాన్స్ సక్సెస్ స్టోరీ.. డైనింగ్ టేబులే ప్రయోగశాల. కట్ చేస్తే.. 450 కోట్ల వ్యాపార సామ్రాజ్యం.!

Published on: Tue Sep 15, 2026 1:19PM

ఇండియన్ ఫుడ్ సెక్టార్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నైలాన్స్' (Nilon) సక్సెస్ స్టోరీ స్ఫూర్తిమంతం.   సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్‌పై చిన్నపాటి ప్రయోగాలతో ప్రారంభమైన నైలాన్ వ్యాపార సామ్రాజ్యం వందల కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఈ ప్రయాణంలో, ప్రస్థానంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లను అధిమమించింది. నైలాన్ విజయ ప్రస్థానంలో   సురేష్ సంఘవి, ప్రఫుల్ సంఘవిల పాత్రే కీలకం. కష్టనష్టాలను లెక్క చేయకుండా సంస్థ పురోగమనానికి ఈ అన్నదమ్ములిద్దరూ అహర్నిశలూ శ్రమించారు. 

మహారాష్ట్ర  జల్గావ్ జిల్లా ఉత్రాన్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సురేష్ సంఘవి, ప్రఫుల్ సంఘవి 1962లో ఈ సంస్థకుఅంకురార్పణ చేశారు. వీరి కుటుంబానికి  ఆహార ఉత్పత్తుల రంగంలో ఒకింత అనుభవం ఉంది.   మహారాష్ట్ర ప్రభుత్వ భూ సంస్కరణల చట్టం కారణంగా కుటుంబం తమకున్న భూముల్లో సింహభాగాన్ని కోల్పోయింది. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అఈ తరుణంలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేటైన  సురేష్ సంఘవిని  ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ప్రోత్సహించాడు ఆయన అన్న ప్రఫుల్ సంఘవి.  

తొలినాళ్లలో   వసతులు లేకపోవడంతో, ఈ అన్నదమ్ములిద్దరూ,   తమ ఇంట్లోని డైనింగ్ టేబుల్‌నే ప్రయోగశాలగా మార్చుకున్నారు. తోటల నుంచి సేకరించిన తాజా పండ్లు, కూరగాయలతో వివిధ రకాల పదార్థాలను తయారు చేయడం ప్రారంభించారు. అప్పట్లో మార్కెట్లో ట్రెండ్‌గా ఉన్న నైలాన్ ఫైబర్ పేరు స్ఫూర్తితో వారు తమ ఉత్పత్తులకు  నైలాన్స్  అని నామకరణం చేశారు. తొలి రోజుల్లో పండ్ల రసాలు, జామ్‌లు, జెల్లీలు, కెచప్‌లను తయారు చేసి కారులో తిరుగుతూ విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే మార్కెట్ నుంచి పెద్దగా స్పందన లేదు. 

వరుసగా నాలుగేళ్లపాటు నష్టాలు పేరుకుపోవడంతో ఇక వ్యాపారాన్ని మూసేయడమే మార్గమని భావించారు. అయితే  సురేష్ సంఘవి పట్టుదలతో ముందుకు సాగారు. అదే సమయంలో అంటే 1966లో ఆర్మీ క్యాంటీన్ల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన టెండర్లు వారికి ఒక అవకాశంగా మారాయి.  . మిరప, మామిడి, మిక్స్డ్, నిమ్మ వంటి నాలుగు రకాల పచ్చళ్ల సరఫరా కోసం వారు దరఖాస్తు చేసి అన్నింట్లోనూ కాంట్రాక్టులు దక్కించుకున్నారు.

ఈ  ఆర్డర్ల కోసం వారు అప్పులు చేసి మరీ 7వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌  ఏర్పాటు చేశారు. 1969, 70 నాటికి నైలాన్స్ మొత్తం విక్రయాలలో పచ్చళ్ల వాటా   95 శాతానికి చేరుకుంది. మిలిటరీ కుటుంబాలే కాదు..  దేశవ్యాప్తంగా  వినియోగదారుల నుంచి కూడా ఈ నైలాన్స్  పచ్చళ్లకు మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత బొప్పాయతో తయారు చేసే టుట్టి-ఫ్రూటీ  వంటి సరికొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టి సక్సెస్ అయ్యారు సంఘవి సోదరులు. 

కాలక్రమేణా కంపెనీలో ఆధునిక మార్పులు వచ్చాయి.  2004లో రాజీవ్ అగర్వాల్‌ను సీఈఓగా నియమించారు. రాజీవ్ అగర్వాల్ నియామకం తరువాత కంపెనీ వ్యాపార వ్యూహాల్లో భారీ  మార్పులు వచ్చాయి. సురేష్ సంఘవి కుమారుడైన దీపక్ సంఘవి నేతృత్వంలో ఈ బ్రాండ్ మరింత విస్తరించింది. కేవలం పచ్చళ్లకే పరిమితం కాకుండా పాస్తా సాస్, పాస్తా మసాలా, సెచువాన్ చట్నీ, అల్లం,వెల్లుల్లి పేస్ట్ వంటి   రకాల ఫుడ్ ప్రొడక్ట్స్‌ను నైలాన్స్ మార్కెట్లోకి తెచ్చింది.

మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల రుచులను గమనిస్తూ నాణ్యతలో ఇసుమంతైనా రాజీపడకుండా ఈ సంస్థను నడిపిస్తున్నారు. పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, రిటైల్ మార్కెట్‌పై దృష్టి పెట్టడంతో  నైలాన్స్ సంస్థ క్రమంగా వృద్ధి చెందింది.  తొలినాళ్లలో కేవలం   8 కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న ఈ సంస్థ, ఇప్పుడు   450 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించే స్థాయికి ఎదుగింది. మహారాష్ట్రలోని జల్గావ్‌లోని తమ తయారీ కేంద్రాల ద్వారా స్థానిక ఉపాధికీ నైలాన్స్ ఈ సంస్థ పెద్దపీట వేస్తోంది.

భవిష్యత్తులోనూ మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునేలా నైలాన్స్   ఉత్పత్తుల శ్రేణిని విస్తరించే ప్రణాళికలతో అడుగులు వేస్తున్నది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తూ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగే క్రమంలో ఉంది. ఒక సాధారణ డైనింగ్ టేబుల్ ప్రయోగంగా ప్రారంభమైన ఈ సంస్థ, నేడు  ఇండియన్ కిచెల్ లో ఒక అనివార్య ప్రొడక్ట్ గా మారింది. ఈ విజయ ప్రస్థానం  కృషి ఉంటే మనుషులు   ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చు అనేదానికి నిలువెత్తు దర్పణంగా దర్జాగా నిలబడింది.  

[Nilons success story, Suresh and Prafful Sanghavi, Indian pickle brand, Jalgaon food company,  450 crore FMCG brand, Telugu One]