హైదరాబాద్‌లో ఇక నైట్ బస్సులు.. 6 మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు..!
Published on: Wed Aug 26, 2026 3:51PM

ఉద్యోగాలు, ఉపాధి కోసం నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ప్రయాణించే వారికి రాత్రివేళ ప్రజా రవాణా కొరత ఇబ్బందిగా మారుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బస్సు సర్వీసులు తగ్గిపోవడం, 11 గంటల తర్వాత మెట్రో సేవలు నిలిచిపోవడంతో నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోలు, ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయించాల్సి రావడంతో అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రాత్రివేళ ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాత్రి 10.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రత్యేక నైట్ బస్సులు నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ సేవలను ప్రతిరోజూ నిరంతరాయంగా నిర్వహించనున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు తొలి దశలో 30 ప్రత్యేక బస్సులను 6 ప్రధాన మార్గాల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రాత్రివేళ విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ఐటీ–బీపీఓ సిబ్బంది, దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. మేడ్చల్ నుంచి గచ్చిబౌలికి 195 నంబర్ బస్సు, కొండాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు 10H బస్సు, కోఠి నుంచి పటాన్‌చెరుకు 218, మరో మార్గంలో 222A బస్సులు అందుబాటులో ఉంటాయి. హయత్‌నగర్ నుంచి జేబీఎస్‌కు 290U బస్సు, సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరుకు 219 నంబర్ బస్సు రాత్రివేళల్లో సేవలు అందించనున్నాయి. రాత్రి వేళల్లో ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో మహిళా ఉద్యోగులు ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది.
దీంతో అధిక చార్జీలతో పాటు భద్రతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నైట్ బస్సుల అందుబాటుతో ఈ సమస్య కొంతవరకు పరిష్కారం కానుంది. అత్యవసర రాత్రి ప్రయాణాలకు ప్రజా రవాణా మరింత అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ప్రస్తుతం ఆరు ప్రధాన మార్గాల్లో ప్రారంభించిన నైట్ బస్సులకు ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, ఆక్యుపెన్సీని అధికారులు పరిశీలించనున్నారు. డిమాండ్ పెరిగితే రానున్న రోజుల్లో మరిన్ని మార్గాలకు నైట్ బస్సు సర్వీసులను విస్తరించే అవకాశం ఉంది. దీంతో రాత్రివేళల్లో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు నగర ప్రజా రవాణా మరింత ఉపయోగకరంగా మారనుంది.
Night buses in Hyderabad, Night shift employees, TG RTC, Occupancy, Kondapur, Koti, Secunderabad


