TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నిడదవోలు కూటమి ఐక్యతకు చిచ్చు: పవన్ ఆదేశాల సైతం బేఖాతరు.!

Published on: Wed Nov 25, 2026 1:09PM

ఆంధ్రప్రదేశ్‌లో నిడదవోలు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఎన్డీయే కూటమిలో  రాజకీయ రచ్చకు దారితీసింది. పొత్తు ధర్మంలో భాగంగా మున్సిపాలిటీలో  చైర్‌పర్సన్ పదవి జనసేనకు,  వైస్ చైర్మన్ తెలుగుదేశంకు కేటాయింపు జరిగింది. అయితే ఇందుకు భిన్నంగా జనసేన వ్యవహరించడంతో నిడదవోలు మునిసిపాలిటీలో జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి.   

ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది.  ఒప్పందానికి భిన్నంగా నిడదవోలులో జనసేన నాయకుడు కల్యాణ్ చక్రవర్తి, వైస్ చైర్మన్ పదవికి పోటీ చేసి వైసీపీ కౌన్సిలర్ల మద్దతుతో విజయం సాధించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీనిపై  జనసేన అధనేత,   ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించి తీరాల్సిందేననీ, వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కల్యాణ్ చక్రవర్తికి విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. అయితే కల్యాణ్ చక్రవర్తి ఆ ఆదేశాలను బేఖాతరు చేయడంతో వివారం ముదిరింది. 

కూటమిలో  సీట్ల సర్దుబాటు  ప్రకారం, నిడదవోలులో చైర్‌పర్సన్ పదవి జనసేనకు, వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా జనసేన కౌన్సిలర్ కల్యాణ్ చక్రవర్తి వైస్ చైర్మన్ పదవికి పోటీ చేసి, ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల  మద్దతుతో విజయం సాధించడం కలకలం రేపింది.  

ఈ ఘటనపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కూటమి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ను వివరణ కోరడమే కాకుండా, కల్యాణ్ చక్రవర్తితో రాజీనామా చేయించాలని  ఆదేశించారు. అయితే అధినేత ఆదేశాలను ధిక్కరించి మరీ కల్యాణ్ చక్రవర్తి రాజీనామాకు ససేమిరా అన్నారు.  

ఇది కూడా చదవండి: ఊహాగాన సభలకు తెర.. కూటమి ఐక్యతపై క్లారిటీ ఇచ్చిన పవన్​

ఈ వివాదం   కూటమి సమన్వయానికి సవాలుగా మారింది. కూటమి నాయకత్వం 24 గంటల్లోపు ఈ సమస్యను పరిష్కరించకపోతే, తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్  శేషారావు హెచ్చరించడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.      

కల్యాణ్ చక్రవర్తి,  మున్సిపల్ చైర్‌పర్సన్ మురళ జ్యోతి, ఇతర జనసేన కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లడం కూటమి ఐక్యతను డోలాయమానంలో పడేసింది.  సొంత పార్టీ నాయకుడే అధినేత ఆదేశాలను బేఖాతరు చేయడం, పార్టీ తరఫున ఎన్నికైన కౌన్సిలర్లు కూడా అలా ధిక్కరించిన వ్యక్తికే మద్దతుగా నిలవడం జనసేనను ఇరకాటంలో పడేసింది.  

మీకు నచ్చవచ్చు: నేతల మధ్య సయోధ్య.. శ్రేణుల కీచులాట.. కూటమి పార్టీల్లో వింత ముచ్చట!

ఏపీ పంచాయతీ ఎన్నికలు: కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి.!

[Nidadavolu Municipality, Rift, TDPalliance,    ViceChairman, Election,  TDP and Jana Sena, TeluguOne]