TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాశ్మీర్ లో కొత్త ఉగ్రసంస్థ: కుల్గామ్ దాడి దాని పనే.!

Published on: Fri Nov 13, 2026 8:18AM

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్  సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని   జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాగా ఈ దాడికి పాల్పడినది  పాస్దారన్-ఎ-హురియత్ కాశ్మీర్ అనే సరికొత్త ఉగ్రవాద సంస్థ అని తేలింది. ఈ దాడికి బాధ్యత వహిస్తూ  ఈ నూతన ఉగ్రసంస్థ ప్రకటనతో ఆ సంస్థ ఉనికి వెలుగులోకి వచ్చింది.  

కుల్గామ్ జిల్లాలో మోటార్ సైకిళ్లపై వచ్చిన సాయుధ ఉగ్రవాదులు  వ్యూహాత్మకంగా సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపైకి  విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హఠాత్పరిణామంలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఈ దాడి మధ్యాహ్నం సమయంలో మీర్ బజార్ సమీపంలో చోటుచేసుకుంది. 

ఈ ఉగ్రదాడికి తామే పూర్తి బాధ్యులమని పాస్దారన్-ఎ-హురియత్ కాశ్మీర్ సంస్థ ప్రకటించింది. కాశ్మీర్  లోయలో ఇప్పటికే పలు ఉగ్ర సంస్థలు క్రియాశీలంగా ఉండగా, ఇప్పుడు కొత్తగా మరో ఉగ్ర సంస్థ కూడా క్రియాశీలంగా వ్యవహరించడం సంచలనంగా మారింది. భద్రతా బలగాలు మరింత  అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. అదే సమయంలో నిఘా వైఫల్యం కూడా కళ్లకు కట్టింది. 

తాజా దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.  స్థానిక యువతను ఆకర్షించడానికి, కాశ్మీర్ లో భద్రత కరవు అన్న విషయాన్ని చాటే లక్ష్యంతో  ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఎప్పటికప్పుడు కొత్త పేర్లతో తెరపైకి వస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇది కూడా చదవండి:  జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి: సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కాల్పులు..ముగ్గురు జవాన్లకు గాయాలు.!

నిఘా సంస్థలు కూడా పాత ఉగ్రసంస్థలే.. కొత్త పేర్లతో కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని భావిస్తున్నాయి. ఇప్పుడు కుల్గామ్ దాడికి బాధ్యత మేమేనని ప్రకటించుకున్నఈ కొత్త సంస్థ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే దానిపై నిఘా వర్గాలు, భద్రతా దళాలు ఆరా తీస్తున్నాయి.  ఆరా తీస్తున్నారు.

ఇటీవల కొంత కాలంగా  కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న తరుణంలో ఏకంగా సీఆర్పీఎఫ్ స్థావరంపైనే ఉగ్రదాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం కుల్గామ్ పరిసర ప్రాంతాలలో సైన్యం, సీఆర్‌పీఎఫ్,  పోలీసు బలగాలు సంయుక్తంగా  గాలింపు చర్యలు చేపట్టాయి. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తూ పరారైన దుండగుల కోసం గాలిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: జవాన్ సాహసం: భారీ ఉగ్ర దాడి భగ్నం.!

రిపబ్లిక్ డే టార్గెట్ గా ఉగ్ర కుట్ర.. నిఘావర్గాల సమాచారం

[New terror outfit, Jammukashmir, Kulgam, Attack, TeluguOne]