తిరుమల దర్శనాలలో కొత్త రికార్డు.. ఆగస్టులో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 24.52లక్షలు.!
Published on: Tue Sep 1, 2026 11:33AM
.webp)
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. కోనేటి రాయుడి దర్శనం కోసం నిత్యం దేశ విదేశాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. అలా వచ్చే భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతుంటుంది. కాగా ఆగస్టు నెలలో తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సంఖ్య కొత్త రికార్డు సృష్టించింది.వేసవి సెలవులు ముగిసినప్పటికీ స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ తగ్గకపోవడం, ఆషాడ, శ్రావణ మాసాల విశిష్టత తోడవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఆగస్టు నెల భక్తుల సంఖ్య విషయంలో కొత్త రికార్డు సృష్టించింది.
ఒక్క ఆగస్టు నెలలోనే 24.52 లక్షల మందికి పైగా భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణంగా ప్రతిరోజు 60 వేల నుంచి 70 వేల మంది వరకు దర్శనం చేసుకునే తిరుమలలో, రద్దీ పరాకాష్ఠకు చేరిన రోజుల్లో రోజువారీ దర్శనాల సంఖ్యఆగస్టు నెలలో 81 వేలు దాటింది. శ్రీవారి సర్వదర్శనం అంటే టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శన భాగ్యం కోసం ఆగస్టు నెలలో ప్రతిరోజూ 20 నుంచి 24 గంటలకు పైగా పట్టింది.ఇక శ్రీవారి హుండీ ఆదాయం ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 140 కోట్ల 28 లక్షల రూపాయలు వచ్చింది. ఈ కానుకల్లో నగదుతో పాటు బంగారం, వెండి వస్తువులను కూడా ఉన్నాయి.
భక్తుల రద్దీ పెరగడంతో తిరుమల శ్రీవారి ప్రసాదాల విక్రయాలు, రికార్డు స్థాయిలో జరిగాయి. గత నెలలో భక్తులు రికార్డు స్థాయిలో కోటీ 30 లక్షల లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. అలాగే ఒక్క ఆగస్టు నెలలోనే 10 లక్షల 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆకలి తీర్చే దివ్యమైన అన్నప్రసాద వితరణలో భాగంగా, ఒక్క ఆగస్టు నెలలోనే.. అన్నప్రసాద భవనం, క్యూలైన్లలో కలిసి దాదాపు రెండున్నర లక్షల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
[New Record in Tirumala Devotees Count, TTD Hundi Income Record, Tirumala Temple Updates, Srivari Laddu Sales, Tirumala Darshan Waiting Time, Telugu One]


