TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెంబేలెత్తిస్తున్న మరో మహమ్మారి: షమొండా వైరస్.. జంతువుల నుంచి మనుషులకు.!

Published on: Fri Oct 23, 2026 3:59PM

కరోనా మహమ్మారి మృత్యు పంజా విషాద జ్ణాపకాల నుంచి మానవాళి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అంతలోనే మరో ప్రాణాంతక మహమ్మారి విజృంభణకు రంగం సిద్ధమైందన్న వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి. కరోనాయే కాకుండా పలు రకాల వైరస్ లు మానవ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన తరుణంలో మరో కొత్త వైరస్ కోరలు చాస్తోందన్న వార్త మానవాళిని భయపెడుతోంది. ఈ కొత్త మహమ్మారి పేరు షమొండా వైరస్. ఇంత కాలం ఈ వైరస్ జంతువులలోనే కనిపించింది. కానీ తాజాగా ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకూ వ్యాపిస్తోందన్న సంకేతాలు వెలువడ్డాయి.  

 ఫ్రాన్స్‌లో ఈ షమొండా వైరస్ కారణంగా  ఓ వ్యక్తి మరణించాడు.  తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలో ఈ వైరస్ పశువుల్లో వ్యాప్తించింది.  అయితే ఈ మహమ్మారి జంతువుల నుంచి మనుషులకూ వ్యాప్తిస్తుందన్న వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది.  లియోన్ నగరంలోని  ఓ వ్యక్తి షమొండా వైరస్ సోకి మృత్యు ఒడికి చేరాడు.  

 షమొండా వైరస్‌ను మొట్టమొదటిసారిగా 1965లో నైజీరియాలో శువులలో గుర్తించారు. కాలక్రమేణా ఇది యూరప్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్,  ఐర్లాండ్ వంటి ప్రాంతాలకు విస్తరించింది. సాధారణంగా ఈ వైరస్ సన్నని ఈగలను పోలిన  మిడ్స్  అనే కీటకాలు లేదా ఈగల కాటు ద్వారా జంతువులకు వ్యాపిస్తుంది. పశువులకు ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, విరేచనాలు రావడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం కావడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి లక్షణాలు కలుగుతాయి. 

 ఇప్పటివరకు జంతువులకే పరిమితమైన ఈ వైరస్ మొదటిసారిగా ఫ్రాన్స్‌లో ఒక మనిషి ప్రాణాలను బలిగొనడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కి పడింది.   జంతువుల నుంచి మనుషులకు సోకే ఈ అరుదైన వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ,  ఆరోగ్య నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారు.  ఈ వ్యాధి   రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఇప్పటి వరకూ ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదని చెబుతున్నారు.  పశువుల పెంపకం జరిగే ప్రాంతాల్లో పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈగలు, దోమల  కాటు నుంచి రక్షణ పొందడానికి తగిన నివారణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు. 

మనుషుల్లో ఈ వైరస్ వ్యాప్తి వేగం ఎంత, ఇది సోకిన తరువాత మనిషిలో వచ్చే అనారోగ లక్షణాలేంటి, వాటి తీవ్రత ఎంత అన్న అంశాలపై పరిశోధనలు సాగుతున్నాయి.  ఏది ఏమైనప్పటికీ, పశువుల నుంచి మనుషులకు సోకే ఇన్ఫెక్షన్ల జాబితాలో షమొండా వైరస్ చేరడం ఆందోళన కలిగిస్తోంది. 


[New Pendamic Threatening Mankind, Shamonda virus, France, Human Death, Animals Human  Shamonda Virus, Spread, Telugu One]