తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్చార్జ్.. రేసులో సీనియర్ నేత డాక్టర్ ఎ. చెల్లకుమార్..!
Published on: Wed Sep 16, 2026 3:51PM

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లను నియమించే ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఐదారు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే అంశంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుల్లో భాగంగానే తెలంగాణకు కూడా కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్లనున్నారు. సుమారు పది నెలల పాటు ఆమె లండన్‌లో ఉండనున్న నేపథ్యంలో తెలంగాణ వంటి క్రియాశీలక రాష్ట్ర బాధ్యతలను మరో సీనియర్ నేతకు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తున్నారు.
.webp)
ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు పార్టీ వ్యవహారాలపై ఉన్న అనుభవం, వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన నేపథ్యం తెలంగాణ బాధ్యతలకు ఉపయోగపడుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.డాక్టర్ ఎ. చెల్లకుమార్ తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్ నేత. 1991లో అన్నా నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1996లో టి.నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్ వర్గం) తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2011లో టి.నగర్ నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది. అనంతరం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన చెల్లకుమార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
పార్టీలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన చెల్లకుమార్.. గోవా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయనకు ఉన్న అనుభవం ఇప్పుడు తెలంగాణకు ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేడర్‌తో సన్నిహితంగా పనిచేసే స్వభావం, పార్టీ వ్యవహారాలపై అనుభవం ఉన్న సీనియర్ నేతను తెలంగాణ ఇన్చార్జ్గా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటివరకు చెల్లకుమార్ పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే కొనసాగనుంది.
[ New in-charge for Telangana Congress, Dr. A. Chellakumar, Telangana Congress Party, CM Revanth reddy, Meenakshi Natarajan, Telangana Congress Incharge, AICC, Congress Party, Telangana Politics, PCC Chief Mahesh Kumar Goud ]


