బంధువులకు పొరపాటున కూడా ఈ విషయాలు చెప్పకండి. లేదంటే నాశనమే..!
Published on: Fri Nov 20, 2026 7:58AM
బంధువులకు పొరపాటున కూడా ఈ విషయాలు చెప్పకండి. లేదంటే నాశనమే..!

మన జీవితంలో మనం ఎవరినైనా గుడ్డిగా నమ్మి మన రహస్యాలను పంచుకున్నప్పుడు, అదే రహస్యం రేపు మన మీదే ఆయుధంగా మారుతుంది. అప్పుడు కలిగే వేదన వర్ణనాతీతం. మనుషులను, వారి స్వభావాలను చాలా లోతుగా అంచనా వేసిన మహామేధావి చాణక్యుడు రెండు వేల సంవత్సరాల క్రితమే కొన్ని కీలకమైన హెచ్చరికలు చేశాడు. తెలివైన వారు కొన్ని విషయాలను ఎప్పుడూ ఇతరుల ముందు బహిర్గతం చేయరని ఆయన స్పష్టం చేశారు. బంధువులు మనవారే అయినప్పటికీ, ప్రతి బంధానికి కొన్ని హద్దులు ఉండాలి. ఆ హద్దులు దాటితే బలమే బలహీనతగా మారుతుంది. చాణక్య నీతి ప్రకారం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో చాలా గోప్యంగా ఉంచుకోవాల్సిన ఆ ఐదు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుంటే..
ధన నష్టం..
వ్యాపారంలో నష్టం రావడం, ఉద్యోగం పోవడం లేదా అప్పుల భారం పడడం వంటి ఆర్థిక ఇబ్బందులను ఎవరికీ చెప్పకూడదు. ఒక వ్యక్తి ఆర్థికంగా కుప్పకూలిపోయినప్పుడు ఆ విషయం ఇతరులకు తెలిస్తే, సహాయం చేయడం దేవుడెరుగు, ఉన్న నమ్మకం కూడా పోతుంది. సరుకు ఇచ్చే వ్యాపారులు వెంటనే బాకీలు అడగడం, కొత్త అవకాశాలు ఆగిపోవడం జరుగుతుంది. మనిషిని నష్టం కంటే ఆ నష్టం గురించిన ప్రచారమే ఎక్కువగా ముంచుతుంది. కాబట్టి ఆర్థిక సమస్యలను సాధ్యమైనంత వరకు మనలోనే దాచుకుని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.
మనసులోని బాధ..
ఎవరో మోసం చేశారనో, తీరని కోరికల వల్ల కలిగే మానసిక వేదననో అందరికీ చెప్పుకోవాలని అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరితోనూ మన బాధను పంచుకోకూడదు. మనం చెప్పే వ్యక్తులు మన బాధను నిజంగా అర్థం చేసుకుంటారా లేదా భవిష్యత్తులో మన బలహీనతగా వాడుకుంటారా అనేది ఆలోచించాలి. కొన్నిసార్లు బంధువులు ఆ బాధను విని సానుభూతి చూపించినట్లు నటించినా, తర్వాత ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్నే మన మీద అస్త్రంగా ప్రయోగిస్తారు. అందుకే మన కన్నీళ్లను సాధ్యమైనంత వరకు భగవంతుడికి లేదా చాలా నమ్మకమైన ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పుకోవాలి.

ఇంటి సమస్యలు..
భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, పిల్లల తప్పులు, ఇంటి అంతర్గత సమస్యలు ఏ ఇంట్లోనే అయినా సహజం. లోపం లేని ఇల్లు అంటూ ఏదీ ఉండదు. కానీ ఆ సమస్యలు ఇంటి గోడల మధ్య ఉన్నంతవరకే చిన్నవిగా ఉంటాయి. అదే గోడ దాటి బయటికి వెళ్తే అది పెద్ద పుకారుగా మారుతుంది. బంధువులతో లేదా స్నేహితులతో ఆ విషయాలు పంచుకున్నప్పుడు, ఎప్పుడైనా కోపం వస్తే వారే ఆ రహస్యాలను బయటపెట్టే ప్రమాదం ఉంది. ఇంటి విషయాలు ఇంటిలోనే పరిష్కరించుకోవడం తెలివైన వారి లక్షణం.
ఇది కూడా చదవండి ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
మోసపోయిన సంగతి..
ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేసినప్పుడు, ఆ బాధను తట్టుకోలేక వెంటనే అందరికీ చెప్పేస్తుంటాం. కానీ అలా చెప్పడం వల్ల అందరూ మనల్ని సానుభూతితో చూస్తారని అనుకోవడం పొరపాటు. కొందరు లోలోపల నవ్వుకుంటారు, మరికొందరు తెలివిలేనివారనే ముద్ర వేస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాకుండా, మీ బలహీనత ఎక్కడ ఉందో ఇతరులకు సులభంగా తెలియజేస్తుంది. చట్టపరమైన సమస్యలైతే అధికారులను ఆశ్రయించాలి తప్ప, ఊరంతా చాటింపు వేయడం వల్ల మన గౌరవమే మసకబారుతుంది.
అవమానం..
నలుగురిలో ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా ఎగతాలి చేసినప్పుడు తీవ్రమైన అవమానం కలుగుతుంది. ఆ అవమానాన్ని పదే పదే అందరికీ చెప్పుకుంటే, ఆ గాయం మానకపోగా మరింత లోతుగా నాటుకుపోతుంది. అంతేకాదు, ఇతరులు మీ పట్ల జాలి చూపించడం మొదలుపెడతారు. జాలి ఎప్పుడూ గౌరవాన్ని తెచ్చిపెట్టదు. చాణక్యుడిని నందరాజు సభలో అవమానించినప్పుడు ఆయన దాన్ని అందరికీ చెప్తూ తిరగలేదు. మౌనంగా ఉండి దాన్నే తన విజయానికి మెట్లుగా మలుచుకున్నాడు.
మనం ఎందుకు ఇలాంటి విషయాలన్నీ తోటివారికి చెప్పేస్తుంటాము అంటే, ఒంటరితనం భరించలేక పోవడం లేదా నలుగురి గుర్తింపు కోసమే. కానీ ఇవి రాకుండా ఉండాలంటే ధ్యానం చేయడం, డైరీ రాయడం అలవర్చుకోవాలి. ఏదైనా మాట్లాడే ముందు ఇది చెప్పడం వల్ల నాకేమైనా లాభమా, ఇది రేపు నా మీదికి తిరిగితే నేను భరించగలనా అని మూడు ప్రశ్నలు వేసుకోవాలి. బంధువులను దూరం పెట్టమని చాణక్యుడు చెప్పలేదు, కానీ ఎవరికి ఎంత చెప్పాలో వివేకంతో తెలుసుకోవాలని హెచ్చరించాడు. మీ ఇల్లు ప్రశాంతంగా, మీ మనసు ధైర్యంగా ఉండాలంటే మాటలపై సంయమనం చాలా ముఖ్యం.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు జీవితంలో నిజమైన విజయం ప్రశాంతత కావాలా.. ఇదిగో ఈ సూత్రాలు పాటించండి.. !


