TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేపాల్‌కు వెళ్లిన డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు సేఫ్..!

Published on: Thu Aug 27, 2026 3:05PM

 

నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కైలాస్ మానస సరోవరం యాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. మానస సరోవరం యాత్రలో భాగంగా వెళ్లిన 35 మంది ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

MS రామారావు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో మొత్తం 35 మంది మానస సరోవరం యాత్రకు వెళ్లారు. వీరిలో సుమారు 25 మంది హైదరాబాద్‌కు చెందినవారు కాగా.. చెన్నై, గుంటూరు, ఆస్ట్రేలియా, లండన్ తదితర ప్రాంతాలకు చెందినవారు కూడా ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌ నుంచి ఖాట్మాండుకు చేరుకుని.. అక్కడి నుంచి కైలాస్ యాత్రకు బయలుదేరారు.

కైలాస్ పరిక్రమలో భాగంగా రెండో రోజు యాత్ర కొనసాగుతుండగా వరదల ఘటన చోటుచేసుకుంది. అయితే యాత్రికులు ఆ సమయంలో కైలాస్ పర్వత ప్రాంతంలో ఉండటంతో భారీ వరదల ప్రభావం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఘటన అనంతరం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా వారిని బేస్ క్యాంప్‌కు తరలించారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇవాళ లేదా రేపు కైలాస్ పర్వతం కిందికి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు కూడా కైలాస్ యాత్రలో ఉన్నారు. వరదలు వచ్చిన ప్రాంతాన్ని సతీష్‌రెడ్డి బృందం నిన్న ఉదయం దాటి వెళ్లింది. వారు ఆ ప్రాంతం దాటిన కొన్ని గంటలకే భారీ వరదలు సంభవించినట్లు సమాచారం. ప్రస్తుతం సతీష్‌రెడ్డి దంపతులు సాగా ప్రాంతంలో క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

సుహాసిని ఆచూకీపై కుటుంబ సభ్యుల ఆందోళన..!

మరోవైపు.. ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుహాసిని రెడ్డి ఆచూకీపై ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుహాసిని.. ఇంట్లో పూజ కార్యక్రమం ఉండటంతో భారత్‌కు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం కైలాస్ ట్రావెల్స్ ద్వారా ఆదివారం నేపాల్‌ పర్యటనకు వెళ్లారు.

ఆమె స్నేహితురాలు కూడా ఆస్ట్రేలియా నుంచి ఖాట్మాండుకు వచ్చారు. అక్కడ ఇద్దరూ మరో 29 మందితో కలిసి యాత్రకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంగళవారం రాత్రి సుహాసిని కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని.. తాము ఫోన్ చేసినా ఆమెను సంప్రదించలేకపోతున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇప్పటివరకు అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని సుహాసిని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామే పోలీసులకు మిస్సింగ్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. IMEI నంబర్ ఆధారంగా సుహాసిని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి సమాచారం లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

“నా కూతురు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఆమె ఆచూకీ చెప్పండి” అంటూ సుహాసిని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్ సంస్థను సంప్రదించినప్పటికీ తమతో ఎవరూ సంప్రదింపులు జరపలేదని వారు చెబుతున్నారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న ఇతర యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందడంతో.. సుహాసిని కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

 

Nepal Floods, Nepal Heavy Rains, Kailash Mansarovar Yatra, Kailash Yatra, Satish Reddy, DRDO Former Chairman Satish Reddy, Hyderabad Pilgrims, Nepal Floods Telugu, Sushasini Reddy Missing, Suhasini Reddy, Telugu News, Telugu One