నేపాల్ జల ప్రళయం.. ప్రకృతి వైపరిత్యమా.. మానవ తప్పిదమా?
Published on: Sun Sep 6, 2026 4:16PM

ఇటీవల నేపాల్‌లో సంభవించిన పెను విలయం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. క్షణాల వ్యవధిలో ఊళ్లకు ఊళ్లు నీటమునిగిపోవడం, భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వినాశనానికి కారణాలు ఏమిటి? ఇది కేవలం ప్రకృతి చేసిన బీభత్సమా లేక మానవ తప్పిదాల ఫలితమా అన్న చర్చ జరుగుతోంది. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో..డాక్టర్ దంతి నరసింహారెడ్డి.. అభివృద్ధి పేరిట పర్యావరణ వినాశనానికి పాల్పడటమే ఇటువంటి విపత్తులకు కారణమన్నారు. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడటం వల్లనే నేపాల్ జలవిలయం వంటివి సంభవిస్తున్నాయని కుండబద్దలు కొట్టారు. నేపాల్‌తో పాటు హిమాలయ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదని, ఇది యావత్ ఉపఖండాన్ని కలవరపెట్టే పరిణామమని ఆయన అన్నారు. అభివృద్ధి పేరుతో హిమాలయ పర్వత శ్రేణులలో జరుగుతున్న విద్వంసకర పనులు, నదుల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ చేపడుతున్న ప్రాజెక్టులు ఈ ముప్పును మరింత తీవ్రం చేస్తున్నాయన్నారు.

భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల హిమాలయాల్లోని గ్లేసియర్లు (మంచు చరియలు) వేగంగా కరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడే సరస్సులు అకస్మాత్తుగా తెగిపోవడం లేదా భారీ మంచు పెళ్లలు నీటిలో పడటం వల్ల ఒక్కసారిగా ఉప్పెనలా వరదలు ముంచుకొస్తున్నాయి. దీనిని 'గ్లాఫ్' (గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్) అంటారన్నారు. అయితే ఈ పరిస్థితికి కారణం మానవతప్పిదమేనన్నారు. మావన తప్పిదాల వల్లే సాధారణంగా జరిగే పర్యావరణ మార్పులు అసాధారణ స్థాయిలో జరుగుతున్నాయని గొంతు నరసింహారెడ్డి అన్నారు. అడవుల నరికివేత, పచ్చదనం కోల్పోవడం వల్ల పర్వతాలు సున్నితంగా మారుతున్నాయన్నారు. కొండలను తొలచి రోడ్లు వేయడం, నదుల పక్కనే ఇష్టానుసారంగా ఇళ్లు, కట్టడాలు నిర్మించడం వల్ల ముప్పు మరింత పెరుగుతోందన్నారు.
అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద డాములు, జలవిద్యుత్ ప్లాంట్లు నిర్మించడం కాదని, స్థానిక ప్రజల ఆకాంక్షలను, పర్యావరణ సమతుల్యతను గౌరవించినప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని దొంతి నరసింహారెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పెను ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
[Nepal disaster, Himalayan glaciers, environmental destruction, hydroelectric projects, natural disasters]


