ఒక్క రూపాయికే సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్.. ఎక్కడంటే..!
Published on: Tue Aug 25, 2026 4:11PM

రూపాయికే 5 వేల మంది పట్టే ఏసీ ఫంక్షన్ హాల్..!
సాధారణంగా ఇంట్లో పెళ్లి, శ్రీమంతం లేదా మరేదైనా శుభకార్యం చేయాలంటే సామాన్యుడికి గుర్తుకొచ్చేది అప్పుల భయం. నేటి రోజుల్లో పట్టణాల్లో ప్రైవేట్ కళ్యాణ మండపాలు లేదా ఫంక్షన్ హాళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్క రోజు కార్యక్రమం కోసం వేలు, లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఏసీ సౌకర్యం ఉన్న కార్పొరేట్ లెవెల్ ఫంక్షన్ హాల్ కావాలంటే ఇక చెప్పక్కర్లేదు, మధ్యతరగతి పేద కుటుంబాలకు అది ఒక కలగానే మిగిలిపోతుంది. కానీ, అలాంటి సామాన్యుల కష్టాలను తీరుస్తూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయిలో డిజైన్ చేసిన సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్‌ను కేవలం ఒక్క రూపాయి సంకేతిక అద్దెకే అందుబాటులోకి తీసుకొచ్చి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల కోసం సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న ఈ నూతన ఫంక్షన్ హాల్‌ను ఇటీవల రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారికంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. కేవలం ఒక్క రూపాయికే కార్పొరేట్ వసతులు కల్పిస్తుండటంతో స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఆధునిక సౌకర్యాలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించిన ఈ కళ్యాణ మండపంలో సకల సౌకర్యాలను కల్పించారు. దీని నిర్మాణం కోసం ఎన్‌క్యాప్ (NCAP) పథకం నుంచి రూ.25 లక్షల నిధులను వినియోగించగా, నెల్లూరు నగరపాలక సంస్థ తమ సొంత నిధుల నుంచి రూ.1.15 కోట్లను కేటాయించింది. ఇలా మొత్తం రూ.1.40 కోట్ల భారీ అంచనా వ్యయంతో అత్యంత ఆకర్షణీయంగా, నాణ్యతా ప్రమాణాలతో ఈ హాల్‌ను తీర్చిదిద్దారు.
ఈ ఫంక్షన్ హాల్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇందులో అడుగుపెట్టగానే ప్రైవేట్ స్టార్ హోటళ్లను తలపించేలా సెంట్రల్ ఏసీ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఫ్లోరింగ్ కోసం ఆకర్షణీయమైన ప్రీమియం టైల్స్, కంటికింపుగా ఉండే కార్పొరేట్ తరహా ఇంటీరియర్ డిజైన్‌తో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఈ హాల్ ధగధగలాడుతోంది. కేవలం ఇన్ డోర్ సౌకర్యాలే కాకుండా, శుభకార్యాలకు వచ్చే వేలాది మంది అతిథుల వాహనాల నిలిపివేత కోసం ఎంతో విశాలమైన పార్కింగ్ స్థలాన్ని కూడా సిద్ధం చేశారు.
అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫంక్షన్ హాల్‌లో ఒకే సమయంలో ఏకంగా 5,000 మంది అతిథులు పాల్గొనే భారీ సామర్థ్యం ఉంది. సాధారణంగా 5 వేల మంది పట్టే కార్పొరేట్ హాల్ ను ప్రైవేటులో బుక్ చేయాలంటే భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది, కానీ నెల్లూరు కార్పొరేషన్ కేవలం ఒక్క రూపాయికే ఈ సదుపాయాన్ని అందిస్తుండటం నిజంగా పేదలకు ఒక పెద్ద వరమనే చెప్పాలి.
ఈ చారిత్రాత్మక నిర్ణయంతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిరుపేదలు, నిరుద్యోగులు, రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యులు తమ ఇంటి వేడుకలను ఎంతో వైభవంగా, రూపాయి ఖర్చు లేకుండా జరుపుకునే వెసులుబాటు కలిగింది.
లక్షల రూపాయల అద్దె భారం తగ్గడంతో తమ ఆదా అయిన సొమ్మును పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవచ్చని పలువురు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి ఏసీ కళ్యాణ మండపాలను కేవలం ధనికులకే పరిమితం కాకుండా, సమాజంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి తెచ్చిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చొరవపై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Nellore one rupee function hall, Nellore Municipal Corporation, AC function hall for one rupee, Minister Narayana Nellore, Corporate function hall Nellore, AP local news, Minister Narayana


