TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేహాబోరా, విద్యార్థి సమస్యలపై అలుపెరుగని పోరు: యువతరం ప్రతినిథిగా జాతీయ గుర్తింపు.!

Published on: Mon Oct 5, 2026 10:38AM

దేశవ్యాప్తంగా విద్యా రంగానికి సంబంధించిన సమస్యలు, పరీక్షల నిర్వహణలో  లోపాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ తీరుపై జరుగుతున్న ఆందోళనల్లో  ప్రముఖంగా వినిపిస్తున్న పేరు నేహా బోరా. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి (జేఎన్ యూ) చెందిన పీహెచ్‌‌డీ విద్యార్థి అయిన నేహాబోరా  ప్రస్తుతం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె వాగ్ధాటి, విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె అవగాహన, విశ్లేషణ  నేహాబోరాను  వర్సిటీ క్యాంపస్ స్థాయి నుంచి జాతీయ రాజకీయ చర్చల్లోకి అడుగుపెట్టేలా చేశాయి. 

వామపక్ష విద్యార్థి సంఘమైన  ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేహా బోరా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్యార్థి సమస్యలపై గళం వినిపిస్తున్నారు. నీట్ , యూజీసీ నెట్వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో  అవకతవకలను ఆమె తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేంద్రీకృత పరీక్షా విధానం వల్ల కోట్లాది మంది యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ) ని వెనక్కి తీసుకోవాలని, ఎన్టీఏను ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

ఈ పోరాటంలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేహా బోరా చేపట్టిన 23 రోజుల నిరశన దీక్ష ఆమెకు జాతీయ స్థాయిలో   గుర్తింపు తెచ్చిపెట్టింది. పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆమె ఈ దీక్షచేశా. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తెచ్చేందుకు జెన్-జెడ్ రైజింగ్  కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆమె దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో  పర్యటించారు. కేవలం ఢిల్లీకే పరిమితం కాకుండా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని స్థానిక విద్యా నియామక సమస్యలపై కూడా నేహాబోరా గళమెత్తారు.

తాజాగా అక్టోబర్ 3న ఢిల్లీలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంతో  నేహా బోరా మరోసారి జాతీయస్థాయి వార్తల్లో నిలిచారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలోని  అవకతవకలు, ఓటర్ల పేర్ల తొలగింపునకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా కోరుతూ నిరసనకారులు గళం విప్పారు. ఈ ఆందోళనలో నేహా బోరాతో పాటు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, కపిల్ సిబల్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండో రోజు నిరసనల్లో భాగంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.

వ్యవస్థీకృత సమస్యలను వ్యక్తిగత అంశాలుగా కాకుండా విధానపరమైన లోపాలుగా ప్రస్తావించడం, ప్రత్యక్ష ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, సోషల్ మీడియా వేదికగా యువతను సమీకరించడం వంటి లక్షణాలు నేహా బోరాను నేటి యువ నాయకురాలిగా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆమె రాజకీయ భావజాలంతో ఏకీభవించని వారు కూడా,  విద్యార్థుల హక్కుల కోసం ఆమె చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నారు. ప్రస్తుతిస్తున్నారు. దేశ వ్యాప్తంగా యువత నేహాబోరాను తన నేతగా గుర్తించి ఆదరిస్తున్నారు.   విద్యార్థి ఉద్యమాలలో ఒక బలమైన గళంగా నిలుస్తున్నారు, యావత్ విద్యార్థిలోకం ప్రతినిథిగా ముందు వరుసలో ఉన్నారు.


[Neha Bora, AISA Leader, JNU Research Scholar, NTA Controversy, Student Movements]